యాసంగిలో ధాన్యం సేకరణ, కొనుగోళ్లకు సిద్ధం కావల్సిందిగా అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. ఈమేరకు మంగళవారం.. కల్లెక్టర్లతో సీఎస్ దూరదృశ్య మాధ్యమం ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ యాసంగిలో కూడా ధాన్యం విరివిగా మార్కెట్‌కు వచ్చే అవకాశముందని సోమేశ్ కుమార్ తెలిపారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ధాన్యం కొనుగోళ్లు చేయటానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవలసిందిగా ఆయన సూచించారు. ఈ దూరదృశ్య మాధ్యమ సమావేశంలో వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష పాల్గొన్నారు.
నర్సరీలపై ప్రత్యేక శ్రద్ధ
ఉపాధి హామీ పథకం కింద వనపర్తి జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో 100 రోజుల పని చేపట్టాలని సీఎస్ చెప్పారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో చేపట్టిన వైకుంఠధామాలు, రైతు వేదికలు, రైతు కల్లాలను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. హరిత హారంలో భాగంగా నర్సరీల లక్ష్యాలను సాధించాలని.. ఈ రెండు మాసాలు నర్సరీల నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
పచ్చదనంతో రహదారులు..
జిల్లా కేంద్రంలో రహదారుల వెంట మూడు వరసల్లో పెద్ద పెద్ద మొక్కలు నాటాలని సీఎస్ అన్నారు. సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల ఏర్పాటుకు చొరవ చూపాలని చెప్పారు. కొవిడ్ నిబంధనలకు సంబంధించి జారీ చేసిన 68, 69 జీఓలు పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని కల్లెక్టర్లకు సూచించారు. ఐకేపీ ఆధ్వర్యంలో జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ షేక్ యస్మీన్ బాష సీఎస్‌కు తెలిపారు.
ఇదీ చదవండి: మూసీపై దృష్టి పెట్టి.. సాగర్‌ను వదిలిపెట్టి..