ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వనపర్తి జిల్లాకు వచ్చే వలస కూలీలు, ఇతరులపై పూర్తి దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు. కలెక్టరేట్ నుంచి మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఏదైనా కారణంగా జిల్లాలో ఉండిపోయినవారు స్వస్థలాలకు వెళ్లిపోవచ్చని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు. అయితే వారి కోసం ఎలాంటి రవాణా సదుపాయం కల్పించేది లేదని... సొంత వాహనాలల్లో వెళ్లాలని స్పష్టం చేశారు. వెళ్లేవారి పేరు, వెళ్లే ప్రాంతం, రాష్ట్రం, తదితర వివరాలు చెక్‌పోస్టు వద్ద నమోదు చేసుకోవాలని తెలిపారు. జిల్లాకు వచ్చి పోయేవారి సమాచారాన్ని అన్ని చెక్‌పోస్టుల నుంచి ప్రతి మూడు గంటలకు ఒకసారి అందజేయాలని పోలీస్ శాఖను ఆదేశించారు.
బయట నుంచి వచ్చిన వారికి మండల స్థాయి బృందాలు పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈ విషయంలో తహసీల్దార్, వైద్యాధికారి, ఎస్‌ఐ, ఎంపీడీవోలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎవరిలోనైనా కొవిడ్ లక్షణాలు ఉంటే తక్షణమే వారిని హోమ్ క్వారంటైన్‌లోకి పంపాలన్నారు.
ప్రత్యేకించి రెడ్‌జోన్‌ల నుంచి జిల్లాకు ఎవ్వరూ రాకుండా చూడాలని అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు.
హరిత హారంలో ఇంకా 25 శాతం బ్యాగ్ ఫిల్లింగ్ చేయవలసి ఉందని అందువల్ల తక్షణమే ఆ పని పూర్తి చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద కూలీల సంఖ్య పెంచాలని సూచించారు.
లాక్‌డౌన్‌లో బిపి, షుగర్ తదితర వ్యాధులతో బాధపడుతన్నవారికి మందులు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ డి .వేణు గోపాల్, ఆర్డీవో చంద్రారెడ్డి, డీఎస్పీ కిరణ్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రీనివాసులు, జిల్లా ఆసుపత్రి సూరింటెండెంట్ డాక్టర్ హరీష్ హాజరయ్యారు.
ఇదీ చూడండి:'స్వీయ నియంత్రణతోనే సురక్షిత జీవనం'