వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మిపల్లి స్టేజి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అన్నా చెల్లెలు అక్కడికక్కడే మృతి చెందారు. తూంకుంట గ్రామానికి చెందిన అన్నా చెల్లెలు, పెద్దదగడ గ్రామానికి వెళ్లి వారి పెద్దనాన్న పిల్లలకు రాఖీ కట్టి బైక్పై తిరిగి స్వగ్రామానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో లక్ష్మిపల్లి స్టేజి దగ్గర ఆర్టీసీ బస్సు బైక్ను ఢీ కొట్టింది. అన్నాచెల్లలు అక్కడికక్కడే మరణించారు. మరో మహిళ లక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి.
పరిస్థితి విషమించడం వల్ల వనపర్తి ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ డ్రైవర్ దిగి పారిపోయాడు. ప్రమాదం జరిగిన చోట రోడ్డు రక్తసిక్తం అయింది. మృతుల బంధువుల ఆర్తనాదాలు అక్కడికి వచ్చిన వారికి కన్నీళ్లు తెప్పించాయి. ఒకే కుటుంబంలో అన్నాచెల్లెళ్ల మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
గతంలో కూడా ఇదే ప్రదేశంలో ఆర్టీసీ బస్సు బైకులను ఢీకొట్టిన ఘటనలు చాలానే ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. లక్ష్మిపల్లి స్టేజి దగ్గర నాలుగు రోడ్లు ఉండడం ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు అంటున్నారు. మృతుల బంధువులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి : ప్లాస్మాను దానం చేయాలని కోరిన హీరో నాని