వికారాబాద్ జిల్లాలోని 18 మండలాల్లోని వీఆర్వోలు ప్రభుత్వ నిర్ణయం ప్రకారం దస్త్రాలను తహసీల్దార్లకు అప్పగించారు. 18 మండలాలకు గానూ.. 240 క్లస్టర్లు, 516 గ్రామపంచాయతీల్లో 240 మంది వీఆర్వోలకు గానూ 192 మంది విధులు నిర్వహిస్తున్నారు. 992 మంది వీఆర్ఏలకు గానూ.. 796 మంది పని చేస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయం ప్రకారం మొత్తం 9 రకాల రికార్డులను, ప్రజా దర్బార్లలోని వినతి పత్రాలను, కులం, ఆదాయం వంటి సర్టిఫికెట్ కోసం చేసుకున్న దరఖాస్తులు తిరిగి ఇచ్చేస్తున్నారు. ప్రజల కోసం పని చేస్తున్న తాము ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటున్న వీఆర్వోలు, వీఆర్ఏలు.. అభాండాలు మోపుతూ తమను తప్పించడం బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వీఆర్వోల నుంచి దస్త్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తహసీల్దార్లు తెలిపారు.