గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. కాలనీలు వరద నీటిలో మునిగిపోయాయి. వికారాబాద్ జిల్లాలోని గ్రామాల్లోను దాదాపు ఇలాంటి పరిస్థితే కనబడుతోంది. దీంతో కలెక్టర్ పౌసమి బసు యాలాల మండలంలో పర్యటించారు. మండల పరిధిలోని అగ్నూర్, సంఘం కుర్దు ఇంకా పలు గ్రామాల్లో కలెక్టర్ పర్యటించారు. ఆయా గ్రామాల్లో జరుగుతున్న వైకుంఠధామం పనులను పరిశీలించారు. ఇందులో భాగంగానే ఆమె సంఘం కుర్దు గ్రామానికి వెళ్లారు.
గ్రామ సమీపంలోని వైకుంఠ ధామానికి వెళ్లేందుకు దారిపొడవునా భారీ వర్షాలకు బురదమయంగా మారింది. అక్కడికి వాహనాలు వెళ్లలేకపోయినా.. నిర్మాణపనులను చూడాలని ఆమె నిర్ణయించుకున్నారు. దీంతో గ్రామంలోని ట్రాక్టర్‌ను తెప్పించి.. 3 కిలోమీటర్ల దూరం ట్రాక్టర్‌పై సర్పంచ్‌తో కలిసి ప్రయాణించారు. ఆమెతో వచ్చిన అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఆ సన్నివేశం చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. గ్రామం నుంచి వైకుంఠ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలని.. పరిశీలించి నిధులు కేటాయిస్తానని కలెక్టర్ తెలిపారు.
ఇదీ చదవండి: Hyd Floods: నిండుకుండల్లా జంట జలాశయాలు.. మూసీ పరివాహక ప్రాంతాలు అప్రమత్తం