వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలం మొరంగ పల్లి గ్రామానికి చెందిన మీనా ... ప్రసవం కోసం మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి వెళ్లింది. వైద్యులు లేకపోవడం వల్ల.. నర్సులే ఆమెకు ప్రసవం చేసే ప్రయత్నం చేశారని మృతురాలి భర్త ఆరోపిస్తున్నాడు. నర్సులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే మీనాకి అధిక రక్తస్రావం అయిందని తెలిపాడు.
అంబులెన్స్ ఆపి... రోడ్డుపైనే చికిత్స
వైద్యులకు సమాచారమిచ్చినా... వారు రాకపోవడం వల్ల సంగారెడ్డికి తరలించే ప్రయత్నం చేశారని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. సదాశివపేట వద్ద మోమిన్‌పేట వైద్యుడు అంబులెన్స్‌ను ఆపి దాదాపు 40 నిమిషాల పాటు అంబులెన్స్‌లోనే ఆమెకు చికిత్స చేశారని చెప్పారు. మీనా పరిస్థితి మరింత విషమించడం వల్ల వైద్యులు... ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లమని సూచించారని, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయిందన్నారు.
మృతురాలి బంధువుల ఆందోళన
తమ కూతురు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ... మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహంతో ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న సీఐ నగేశ్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు వినకుండా తమకు న్యాయం జరిపించమని కోరుకుంటున్నారు.
ఇవీ చూడండి: 'వనరుల పెంపకం, దుబారా తగ్గింపుపై సమాలోచనలు'