మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చంద్రశేఖర్.. భాజపా తీర్థం పుచ్చుకోవడానికి ముహూర్తం ఖరారైంది. భాజపాలో ఈనెల 28న చేరేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చంద్రశేఖర్ వెల్లడించారు. పార్టీలో ఆరేళ్లుగా కొనసాగుతున్నప్పటికీ.. వికారాబాద్‌లో పోటీ చేసే అవకాశం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను ఉత్తమ్ కుమార్ రెడ్డి నాశనం చేశారని విమర్శించారు.
కాంగ్రెస్‌ను జీరో చేశారు...
ఉత్తమ్ భార్య ఓడిపోయినా ఆయన నైతిక బాధ్యత వహించలేదని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను జీరో చేసి రాజీనామా చేశారని మండిపడ్డారు. ఎన్నికల్లో పార్టీల గుర్తులు బలంగా పనిచేస్తాయని.. గతంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తర్వాత ఆ విషయం తెలిసిందన్నారు. తనకు నాగర్ కర్నూల్ టికెట్ రాకుండా మంత్రి సబితా రెడ్డి అడ్డుకున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రస్తుతం ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది. భాజపాలో కలిసి పనిచేద్దామని డీకే అరుణ నన్ను కోరారు. భాజపాలోకొచ్చిన తర్వాత షరతులు పెడితే ఒప్పుకోను. కాంగ్రెస్‌లో అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత లేదు. ఒకే వర్గానికే ప్రాధాన్యత ఉంది. - మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత ఏ.చంద్రశేఖర్
విడదీసి అన్యాయం చేశారు...
భాజపా జాతీయ పార్టీ అయినప్పటికీ రాష్ట్రంలో ఒక బీసీ నాయకుడైన.. బండి సంజయ్‌ని పార్టీ అధ్యక్షుడిగా నియమించిందన్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి వికారాబాద్‌ను విడదీసి అన్యాయం చేశారని ఆరోపించారు.
వచ్చే ఎన్నికల్లో భాజపా తరపున వికారాబాద్‌లో పోటీ చేసి.. ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ మాదిరి అభివృద్ధి చేసి చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భాజపా పాలనను జనం కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి రెండు రోజుల్లో రాజీనామా చేస్తానని మాజీ మంత్రి చంద్రశేఖర్ ప్రకటించారు.