ఎగువ నుంచి వస్తోన్న భారీ వరదల కారణంగా నాగార్జునసాగర్ నిేండుకుండలా మారింది. మరో 40 టీఎంసీలు చేరితే పూర్తిగా నిండుతోంది. మరోవైపు శ్రీశైలం నుంచి ప్రవాహం భారీగా ఉన్నందున.. సాయంత్రం సాగర్ గేట్లు ఎత్తే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.
నదిలోకి దిగవద్దు.. చేపల వేట వద్దు
నీటి విడుదలను దృష్టిలో ఉంచుకొని జాలర్లు చేపల వేటకు నదిలోకి దిగవద్దని, పర్యటకులు సైతం నది దగ్గరకు రావొద్దని సూర్యాపేట జిల్లా ఎస్పీ భాస్కరన్ సూచించారు. జిల్లాలో చెరువులు, కుంటలు, మూసీ, కృష్ణ నదుల్లో వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. తెప్పలు, పడవలపై కృష్ణా నది దాటే ప్రయాణికులు రవాణా సాగించవద్దని వద్దని హెచ్చరించారు.
దిగడం ప్రమాదకరం...
సాగర్ డ్యామ్ గేట్లు ఎత్తడం వల్ల నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండే నేపథ్యంలో నదిలోకి దిగడం ప్రమాదకరమని ఎస్పీ పేర్కొన్నారు. రోడ్డుపై నీరు ప్రవహించే కల్వర్టు వద్ద వాహనాలను రోడ్డు దాటించవద్దని సూచించారు. పాత గోడలు కలిగి ప్రమాదకరంగా ఉన్న పురాతన నివాసాల్లో ఉండటం సురక్షితం కాదన్నారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు.
ఈ రెండు నెంబర్లకు ఫోన్ చేయండి...
అత్యవసర పరిస్థితుల్లో పోలీసు సహాయం పొందడానికి 100 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. లేదా స్థానిక పోలీస్ స్టేషన్లో అధికారులను సంప్రదించాలని స్పష్టం చేశారు. జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 8331940806 , 8331940728కు ఫోన్ చేస్తే పోలీసులు సాయమందిస్తారని ఎస్పీ భాస్కరన్ వెల్లడించారు.
ఇవీ చూడండి : 'జలవనరుల శాఖను ప్రత్యేక డైరెక్టరేట్‌గా పరిగణించాలి'