యాదవులు ఇలవేల్పుగా భావించే లింగమంతుల స్వామి జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. నిన్న రాత్రి కేసారం నుంచి పెద్దగుట్టకు దేవరపెట్టె తరలిరావడంతో మొదలైన వేడుకలు... భక్తుల కోలాహలం మధ్య భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. గంపలు నెత్తినెత్తుకొని బోనాలు సమర్పించేందుకు మహిళలు బారులు తీరారు. లింగమంతులస్వామి, చౌడమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మేడారం తర్వాత రెండో అతిపెద్ద జాతరగా భావించే పెద్దగట్టు జాతరలో ... సంప్రదాయ డోలు వాయిద్యాలు, బేరీల చప్పుళ్లతో గుట్ట పరిసరాలు మార్మోగుతున్నాయి.
దర్శించుకున్న మంత్రులు
మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, జగదీశ్‌రెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులు ఇవాళ దేవదేవుళ్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జాతర ఏర్పాట్లుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
భక్తులు అసంపూర్తి
గొల్లగట్టు జాతరకు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులు తరలివస్తుండడంతో... అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. మహిళల భద్రత కోసం షీ టీంలు, నిఘా కోసం సీసీ కెమెరాలు... 14 వందల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. కొవిడ్ లక్షణాలు ఉన్న వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అటు జాతరలో ఏర్పాట్లపై పలువురు భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీస మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.
భారీ ట్రాఫిక్ జాం
జాతరకు తరలివస్తున్న వాహనాలతో హైదరాబాద్-విజయవాడ రహదారిపై భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది. సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించిపోవడంతో... ట్రాఫిక్ నియంత్రణకు పోలీసు సిబ్బంది శ్రమిస్తున్నారు.
- ఇదీ చూడండి: లింగమతుల జాతరకు పోటెత్తిన భక్తులు..