భారీ వర్షాలు రైతన్నను నిలువునా ముంచేశాయి. సూర్యాపేట, భువనగిరి-యాదాద్రి, నల్గొండ జిల్లాలు సహా రాష్ట్రంలో అనేక చోట్ల ధాన్యం తడిసిపోయింది. మార్కెట్లకు వచ్చిన ధాన్యంతో పాటు కోతకొచ్చిన పంటా దెబ్బతింది. మూసీ పరివాహక ప్రాంతం పరిధిలో ఇతర జిల్లాల కన్నా కాస్తంత ముందుగా వరి సాగు వేశారు. అధిక శాతం ప్రాంతాల్లో కోతలు కూడా పూర్తయ్యాయి. వాటిల్లో తేమ శాతాన్ని తగ్గించేందుకు కొనుగోలు కేంద్రాలున్న మార్కెట్ యార్డులకు తీసుకువచ్చి ఆరబెడుతుంటారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆరబెట్టిన ధాన్యమంతా తడిసిపోయింది. నిజామాబాద్, మెదక్, జనగాం జిల్లాల్లో కోసి పోలంలోనే ఉంచిన ధాన్యం కూడా నీట మునిగంది. ఆరబెట్టుకుని విక్రయించడానికి వారం, పది రోజులు పడుతుందని అంచనా.
నేటి నుంచి నిజామాబాద్, కామారెడ్డిలలో కొనుగోళ్లు
అవసరం మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా పౌరసరఫరాల శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.ఆ మేరకు సుమారు తొమ్మిది వందల వరకు కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.మూసీ పరీవాహక ప్రాంత జిల్లాలతోపాటు పలు జిల్లాల్లో ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరుకుంటోంది. నిజామాబాద్, కామారెడ్డిలలో గురువారం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 17శాతం కన్నా తక్కువగా తేమ ఉంటేనే కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఆరబెట్టిన తరవాత కొనుగోళ్లు మొదలవుతాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఇవీచూడండి: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు... జనజీవనం అస్తవ్యస్థం