రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందిన యువకుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ... మృతుడి బంధువులు సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఆందోళన చేపట్టారు.
తిరుమలగిరి మండల కేంద్రంలో ఈనెల 11న సాయంత్రం పులిగిళ్ల అంజయ్య, చిర్రబోయిన శ్యాం యాదవ్... పొలం పనుల నిమిత్తం ట్రాక్టర్‌పై వెళ్తుండగా కిందపడి శ్యాం యాదవ్‌కు త్రీవ గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.
ఈనెల12న మృతుడి కుటుంబానికి ట్రాక్టర్ యజమాని రూ. 8 లక్షలు ఇచ్చేటట్లుగా పెద్దమనుషుల సమక్షంలో ఒప్పందం కుదిరింది. ఆదివారం తుంగతుర్తి ఆసుపత్రిలో శపపరీక్ష నిర్వహించి తిరుమలగిరికి తీసుకొచ్చారు. అనంతరం ట్రాక్టర్ యజమాని పైసలు ఇవ్వననడం వల్ల ఆందోళన చేపట్టారు.
పోలీసుల సమక్షంలో మరోసారి చర్చలు జరపగా రూ. 4 లక్షలు ఇచ్చేందుకు యజమాని ఒప్పుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడం వల్ల సూర్యాపేట- జనగాం ప్రధాన రహదారిపై రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు.
ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా సూర్యాపేట డీఎస్పీ మోహన్ కుమార్ ఘటనా స్థలికి చేరుకున్నారు. మరోసారి చర్చలు జరపగా బాధిత కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షలు ఇచ్చేవిధంగా యజమాని ఒప్పుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు.
ఇదీ చూడండి: ఫలితాల షాక్ నుంచి సీఎం కోలుకోలేదు: డీకే అరుణ