Peddagattu jathara: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వమే పెద్దగట్టు జాతరను అట్టహాసంగా నిర్వహిస్తోంది. ఈ ఏడాదీ జాతర నిర్వహణకు మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో ఇప్పటికే రూ.5 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. కొవిడ్ ఉండటంతో 2021లో జరిగిన జాతరకు భక్తుల రాక కొంత మందగించినా.... తెలంగాణ, ఏపీతో పాటూ మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన సుమారు 15 లక్షల మంది భక్తులు ఈ దఫా లింగమంతుల స్వామిని దర్శించేందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు, ఆలయ కమిటీ అంచనా వేస్తోంది.
దీంతో పెద్దఎత్తున వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా వసతులు కల్పించేందుకు ఇప్పటి నుంచే సూర్యాపేట జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. పోలీసు, పురపాలిక, విద్యుత్, గ్రామీణ నీటిసరఫరా, పంచాయతీరాజ్, దేవాదాయ, రవాణా శాఖలతో మంత్రి జగదీశ్‌రెడ్డి ఇప్పటికే రెండుసార్లు సమీక్షించి ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. జాతరను సీసీ కెమెరాలతో నిఘా వేయడంతో పాటూ భక్తుల పర్యవేక్షణకు డ్రోన్ కెమెరాలను ఉపయోగించనున్నట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ వెల్లడించారు.
ట్రాఫిక్ కత్తిమీద సాము
హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి పక్కనే సూర్యాపేట పురపాలిక పరిధిలో ఈ ఆలయం ఉంది. దీంతో జాతర జరిగే ఐదు రోజుల పాటూ నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. సుమారు వారం రోజుల పాటూ ఒక వైపు మార్గం జాతరకు వచ్చే భక్తులకు కేటాయిస్తుండగా...మరోమార్గం హైదరాబాద్ - విజయవాడ, విజయవాడ - హైదరాబాద్‌కు వెళ్లే వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.
దీంతో గంటల కొద్దీ ట్రాఫిక్‌జాంలు ఏర్పడుతున్నాయి. కొన్ని వాహనాలను నల్గొండ -మిర్యాలగూడ - కోదాడవైపు మళ్లించినా...ప్రస్తుతం సూర్యాపేటకు సమీపంలోని టేకుమట్ల మూసీ బ్రిడ్జి నుంచి నామవరం, గుంజలూరు స్టేజ్ వరకు మళ్లించేలా పోలీసులు చర్యలు చేపట్టారు. మరోవైపు భక్తులు బస చేయడానికి, పార్కింగ్ స్థలానికి ఏటా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
గట్టు కింద ఉన్న చెరువులో ప్రస్తుతం నిండా నీళ్లు ఉన్నందునా కింద భక్తులు బస చేసే పొలాల్లో నీటి జాలు నిల్వ ఉంటోంది. భక్తుల బస నిమిత్తం ఈ దఫా అధికారులు రైతుల నుంచి 40 ఎకరాల వరకు లీజుకు తీసుకున్నారు. ఈ దఫా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందునా అది సరిపోయే అవకాశం లేదని తెలుస్తోంది.
మరోవైపు గట్టుపై భక్తులకు సరిపడా స్నానవాటికలు, మరుగుదొడ్లు లేకపోవడంతో ఎక్కువ సేపు ఆలయం వద్ద ఉండని పరిస్థితి. పారిశుద్ధ్యం, తాగునీటికి సైతం గతంలో భక్తులు ఇబ్బందులు పడిన సందర్భాలున్నాయి. ఈ దఫా ఈ సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపట్టామని అధికారులు వెల్లడిస్తున్నారు.
భక్తులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు :
"జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం ఇప్పటికే రూ.5 కోట్లను మంజూరు చేసింది. ఈ నిధులతో శాశ్వత ప్రాతిపాదికన క్షేత్రంలో నిర్మాణాలు చేపడుతున్నాం. సుమారు 15 లక్షల వరకు భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా దర్శనం చేసుకొని వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నాం. ట్రాఫిక్ జాంలు లేకుండా ఈ దఫా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం." -మంత్రి జగదీశ్‌రెడ్డి
అన్ని శాఖలతో సమన్వయం :
"ఎంత మంది భక్తులు వచ్చినా ఇబ్బందుల్లేకుండా దర్శనం చేసుకొని వెళ్లే విధంగా అన్ని శాఖలతో సమన్వయం చేస్తున్నాం. వారికి పూర్తి రక్షణ కల్పిస్తాం. గతంతో పోలిస్తే ఈ దఫా భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. పార్కింగ్, భద్రతా పరంగా ఎలాంటి ఇక్కట్లు లేకుండా చూస్తాం."-ఎస్పీ రాజేంద్రప్రసాద్
శాశ్వత ప్రాతిపాదికన ఏర్పాట్లుండాలి :
"జాతర సమయంలోనే ఇక్కడ స్నానవాటికలు, మరుగుదొడ్లు, తాగునీరు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఆలయానికి మాములు రోజుల్లోనూ భక్తుల తాకిడి పెరిగింది. శాశ్వత ప్రాతిపాదికన ఏర్పాట్లు ఉంటే మాకు ఇబ్బందులుండవు".-మహేశ్వరి, భక్తురాలు
ఇవీ చదవండి: