భారత నూతన ఆర్థిక విధానాల సంస్కర్త, దేశాన్ని కష్టకాలంలో గట్టెక్కించిన మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు సరైన గుర్తింపు దక్కలేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. క్లిష్ట పరిస్థితుల నుంచి కాంగ్రెస్ను కాపాడిన పీవీ గౌరవాన్ని నిలబెట్టడంలో ఆ పార్టీ విఫలమైందని విమర్శించారు. మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదేళ్లు నడిపిన ఘనత ఆయనకే దక్కుందన్నారు.
కార్పొరేట్ స్థాయిలో గురుకుల విద్యను అందించిన ఘనత పీవీకే దక్కుతుందని మంత్రి కొనియాడారు. కష్టకాలంలో దేశానికి సరైన దిశానిర్ధేశం చేసిన వారిలో పీవీకి మించినవారు లేరన్నారు. దేశానికి ఆయన చేసిన సేవలకు... తర్వాత వచ్చిన ప్రభుత్వాలు గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్డ సేవలు భవిష్యత్ తరాలు గుర్తించేలా సంవత్సరం పాటు శత జయంతి వేడుకలు నిర్వహించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని జగదీష్ రెడ్డి వెల్లడించారు.