కార్తిక సోమవారం, నాగుల చవితి ఒకే రోజున రావడంతో రాష్ట్రంలోని శైవ క్షేత్రాలలో భక్తులు(karthika masam 2021) పోటెత్తారు. సూర్యాపేట జిల్లాలో ప్రసిద్ధి గాంచిన మేళ్ల చెరువు శ్రీ స్వయంభూశంభు లింగేశ్వర స్వామి ఆలయంలో మహిళలు మెుక్కులు చెల్లించుకున్నారు. మఠంపల్లి మండలం మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో వేకువజాము నుంచే మహిళలు భారీగా కార్తిక దీపాలు వెలిగించారు. హుజూర్ నగర్ మండలం బోరుగడ్డలోని నల్లకట్ట సంతాన కామేశ్వరీ సమేత శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూర్యకిరణాలు శంభు లింగేశ్వర స్వామిని తాకడంతో భక్తులు ఈ దృశ్యాన్ని చూడడానికి చుట్టుపక్కల నుంచి భారీగా తరలి వచ్చారు.
మహిళల ప్రత్యేక పూజలు
ఖమ్మం జిల్లాలో నాగుల చవితి పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైరా నది ఒడ్డున పెంచేసిన శివాలయం వద్ద తెల్లవారుజాము నుంచి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించాయి. ఆలయం వద్ద ఉన్న పొట్టలో మహిళలు పాలు పోసి.. మొక్కులు తీర్చుకున్నారు. మండలంలోని శ్రీకృష్ణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలోని పుట్ట వద్ద మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖమ్మంలోని గుంటు మల్లేశ్వరాలయం, రోటరీనగర్ రాజరాజేశ్వరీ ఆలయ ప్రాంగణంలో మహిళలు బారులు తీరారు. నాగుల చవితి సందర్భంగా ఖమ్మం స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని పుట్ట వద్ద మహిళలు పూజలు చేశారు. భద్రాచలంలోని గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేసిన మహిళలు.... కార్తిక దీపాలను నదిలో వదిలారు.
మంత్రి మల్లారెడ్డి పూజలు
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో నాగుల చవితి సందర్భంగా భక్తులు భక్తి శ్రద్ధలతో నాగేంద్రునికి పూజలు నిర్వహించారు. నాగుల చవితి రోజు నాగేంద్రున్ని భక్తి శ్రద్ధలతో పూజించారు. మేడ్చల్ జిల్లా కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయంలో మంత్రి మల్లారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మారుమోగిన శివాలయాలు
ఓరుగల్లు జిల్లాలో శివాలయాలు శివనామస్మరణలతో మారుమోగాయి. ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముక్కంటి చెంత పూజలు చేసి... అభిషేకాలు నిర్వహించి.. తీర్ధప్రసాదాలు స్వీకరించారు. హనుమకొండ వేయిస్తంభాల ఆలయంలో రుద్రేశ్వరున్ని దర్శించుకునేందుకు.. భక్తులు పోటెత్తారు. ఇటు నాగుల చవితి పర్వదిన సందర్భంగా మహిళలు.. పార్కులు, రహదారుల వెంబడి ఉన్న పుట్టల వద్ద బారులు తీరారు. నాగదేవత తమను కరుణించాలంటూ... పాలు పోసి.. పూజలు చేశారు.
వనస్థలిపురంలో...
హైదరాబాద్ వనస్థలిపురం శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో తెల్లవారుజాము నుంచే నాగుల చవితి సందర్భంగా భక్తులు పోటెత్తారు. పంచామృత అభిషేకాలతో సర్ప సూక్తం హోమం నిర్వహించారు. కార్తికేయునికి ప్రీతికరమైన నాగుల చవితి రోజున స్థానిక వర్తకుడు మాలే రవికుమార్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మానసాదేవిలకు వెండి కిరీటాలను ఆలయ ఛైర్మన్ అశోక్ కుమార్‌కు అందజేశారు.
- ఇదీ చదవండి : పర్వదినాల మాసం... మహిమాన్విత కార్తికం