Jagadish Reddy On Power Generation: నాగార్జునసాగర్ నీటి వినియోగం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణాబోర్డుకు చేసిన ఫిర్యాదుపై విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్ విద్యుత్ ఉత్పత్తి విషయంలో ఏపీ ప్రభుత్వం చిల్లరగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. పవర్ గ్రిడ్‌లను కాపాడుకోవడం కోసమే అప్పుడప్పుడు నీటిని వినియోగిస్తున్నామని మంత్రి తెలిపారు. ఏపీ ప్రభుత్వం అసంబద్ధమైన, అర్థంపర్థం లేని విమర్శలతో కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేయడం అలవాటుగా మారిందన్నారు.
నాగార్జునసాగర్ నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వినియోగించడంలేదని స్పష్టం చేశారు. ఏపీ వాదనలో నిజంలేదన్నారు. డిమాండ్ ఎక్కువ ఉన్న సమయంలో గ్రిడ్‌ని కాపాడేందుకు సాంకేతికపరంగా ఐదు, పది నిమిషాల ఉత్పత్తి అప్పుడప్పుడు జరగడం సహజమేనని మంత్రి తెలిపారు. శ్రీశైలం నుంచి తెలంగాణ ఉత్పత్తి ఆపేసినా... ఆంధ్రప్రదేశ్ ఇప్పటికి కొనసాగిస్తోందని ఆరోపించారు. సమైక్య రాష్ట్రంలో వారే దుర్మార్గంగా నీటిని ఆంధ్రకు బలవంతంగా తరలించుకెళ్లారని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నీటి యాజమాన్యం విలువ తెలియక తమపై ఫిర్యాదు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
'అసంబద్ధ ఆరోపణలతో ఏపీ తన గౌరవం దిగజార్చుకుంది. సాగర్ నుంచి విద్యుదుత్పత్తికి నీటిని తెలంగాణ వాడట్లేదు. రాష్ట్రానికి సాగర్ నుంచి ఎక్కువగా తాగునీటి అవసరాలు ఉన్నాయి. పవర్ గ్రిడ్ కోసం ఐదుపది నిమిషాలు వాడుతుంటారు. శ్రీశైలం నుంచి తెలంగాణ ఉత్పత్తి ఆపినా ఏపీ ఇప్పటికీ చేస్తోంది. మేమెప్పుడూ ఈ విషయంపై ఫిర్యాదు చేయలేదు. ప్రతిదానికి ఏపీ ప్రభుత్వం రాద్ధాంతం చేస్తోంది.'
-- జగదీశ్‌రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి
ఇదీ చూడండి: AP Letter to KRMB: 'తెలంగాణ జల విద్యుత్ ఉత్పత్తిని నిలువరించండి'