కుమారుడు ఇంటికి సక్రమంగా రాకపోవడాన్ని సాకుగా తీసుకుని ఇంట్లో ఒంటరిగా ఉన్న కోడలిపై మామ అత్యాచారానికి యత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం పరిధిలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. తనపై అత్యాచారానికి యత్నించిన మామను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బాధితురాలు గ్రామస్థుల సహాయంతో రహదారిపై ధర్నా చేసింది.
చిలుకూరు మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తితో బాధితురాలికి పది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబ తగాదాల నేపథ్యంలో బాధితురాలిని ఆమె భర్త ఇబ్బందులకు గురి చేస్తున్నాడని నాలుగు నెలల క్రితం కోడలితో మామ కుమారుడిపై కేసు పెట్టించాడు. తర్వాత కుమారుడు ఇంటికి సక్రమంగా రావడం లేదు. ఆ సంఘటనను అదునుగా తీసుకున్న మామ బాధితురాలిపై రెండు మార్లు అత్యాచారానికి యత్నించాడని బాధితురాలు వాపోయింది. రాత్రి వేళల్లో భయం భయంగా గడపాల్సి వస్తోందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు ఇప్పటికైనా చొరవ తీసుకుని అతనికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంది.
ఇదీ చూడండి : ఐదుగురు సర్పంచ్ల చెక్‌పవర్ రద్దు చేసిన కలెక్టర్