తెలంగాణతో కేసీఆర్ కుటుంబమే లాభ పడిందని భాజపా రాష్ట్ర ఇంఛార్జి తరుణ్ చుగ్ ఆరోపించారు. ఖమ్మం పర్యటనకు వెళుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. నాగార్జున సాగర్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఇంద్రసేనారెడ్డికి భాజపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన తరుణ్ చుగ్.. తెలంగాణ కోసం అనేక మంది ప్రాణాలర్పించి తెలంగాణ సాధించారని అన్నారు. బంగారు తెలంగాణ అని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్రాన్ని గరీబ్ తెలంగాణగా మార్చారని అన్నారు. కేంద్రంలోని మోదీ పాలనకు ఆకర్షితులైన అనేక మంది భాజపాలో చేరుతున్నారన్నారు. తెలంగాణలో రాబోయేది భాజపా ప్రభుత్వమేనని ఆయన అన్నారు. దేశంలో కోలుకోలేని స్థితిలో ఉన్న కాంగ్రెస్‌కు మందబుద్ధి బాలుడు రాహుల్ గాంధీ నాయకుడని ఎద్దేవా చేశారు. .
వాస్తు దోషం పట్ల నమ్మకం ఉన్న కేసీఆర్ తెలంగాణకు అతిపెద్ద దోషమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆసుపత్రి పాలైన ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఉద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై భాజపా ఆధ్వర్యంలో ఉద్యమం నిర్వహిస్తామన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. భాజపా ఆందోళన ఫలితంగానే ముఖ్యమంత్రి ఉద్యోగ ప్రకటనలు, పీఆర్సీపై మాట్లాడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నాగార్జున సాగర్ భయం పట్టుకుందన్నారు. రాబోయే సాగర్ ఉప ఎన్నికల్లో భాజపాను అడ్డుకోవడానికి తెరాస, కాంగ్రెస్‌లు కలిసి పనిచేయనున్నాయని ఆయన వెల్లడించారు.
ఇదీ చదవండి: పంచభూతాలను దోచుకుంటున్న పార్టీ తెరాస: బండి సంజయ్