నమ్మించి గొంతుకోయడంమంటే ఇదే మరి! మూగ జీవి కదా అని.. దగ్గరకు వచ్చిన కొండముచ్చుతో ఓ యువకుడు సరదా పడ్డాడు. ఫోన్‌కాల్ రావడంతో ద్విచక్ర వాహనం నిలిపి మాట్లాడుతుండగా.. ఎన్నాళ్లకో కనిపించిన మిత్రుడిలా వచ్చి వాహనంపైకి ఎక్కింది. మొదట కంగారు పడ్డా.. దాని ప్రవర్తన సరిగానే ఉంది కదా అనుకున్నాడు. పైకి సరదాగానే ఉన్నా.. లోన భయం మాత్రం అలాగే ఉంది. అనుకున్నదే అయింది. రెప్పపాటు కాలంలో ఒక్కసారిగా అతడి ముఖంపై దాడి చేసి గాయపరిచింది. ముక్కు, దవడ భాగం గాయపరిచింది. సూర్యాపేట పట్టణంలోని కొత్త బస్టాంట్ సమీపంలో జరిగిన ఘటన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
సూర్యాపేటలో కోతుల బెడదను తప్పించేందుకు పురపాలక సంఘం అధికారులే కొండముచ్చులను తీసుకొచ్చారు. కొన్నాళ్లపాటు కోతులను తరిమిన కొండముచ్చులు... ఇప్పుడు జనాలను తరుముతున్నాయి. గతేడాది సీతారాంపురం వీధిలో ఒక్క రాత్రి 17 మందిపై కొండముచ్చులు దాడి చేశాయి. శుక్రవారం రాత్రి ఆరుగురు వ్యక్తులపై దాడి చేసి గాయపర్చాయి. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో బాధితులకు చికిత్స అందించారు. పురపాలక అధికారులు మాత్రం... అటవీ శాఖ అధికారులలే ఏదైనా నిర్ణయం తీసుకోని ప్రజలను కాపాడాలని అంటున్నారు.