కల్వకుంట్ల కుటుంబం చేతిలో తెలంగాణ బానిస అయిందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్షలో భాగంగా.. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అనంతరావుపల్లిలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. అనంతరం గజ్వేల్ మండలం గుండన్నపల్లి వద్ద దీక్ష చేపట్టారు.
నిరుద్యోగులు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని.. ప్రాణాలు ఎంతో విలువైనవని.. మీ పక్షాన తాము పోరాటం చేస్తున్నామని వైఎస్ షర్మిల భరోసానిచ్చారు. నిజామాబాద్‌లో కేసీఆర్ కుటుంబానికి బుద్ధి చెప్పినట్లుగానే.. హుజూరాబాద్‌లోనూ చెప్పాలని.. నిరుద్యోగులంతా పోటీ చేయాలని సూచించారు. నామినేషన్లు వేసే నిరుద్యోగులు అందరికీ తాము అండగా ఉండి.. సాయం చేస్తామని షర్మిల హామీ ఇచ్చారు.
ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీచేయాలని.. నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 54 లక్షల మంది నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు పెట్టాలని.. అర్హులకు కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పొందే విధంగా ప్రోత్సహించాలని సూచించారు.
దళితులకు 10 లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వ భూములు అమ్మిన కేసీఆర్.. అన్ని వర్గాలకు బంధు ఇచ్చేందుకు తెలంగాణ అమ్మేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పిట్టకథలను తెలంగాణ ప్రజలు నమ్మరని.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్నూ పట్టించుకోవడం లేదన్నారు.
'ఏడేళ్లుగా కల్వకుంట్ల కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయింది. నిరుద్యోగులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీ కోసం మేం నిలబడ్డాం.. మేం పోరాటం చేస్తున్నాం.. మాతో చేతులు కలపండి. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో నిరుద్యోగులూ పోటీచేయాలి. నిజామాబాద్‌లో కేసీఆర్ కుటుంబానికి బుద్ధిచెప్పినట్లు.. ఇక్కడా చెప్పాలి. నామినేషన్లు వేసిన ప్రతిఒక్కరికీ అండగా ఉంటాం.'
-వైఎస్ షర్మిల, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు.
ఇదీచూడండి: tollywood drugs case: ముగిసిన పూరీ ఈడీ విచారణ.. అవసరమైతే మరోసారి..!