జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాలకు తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 44 మందికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ నుంచి కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం సావర్ ఖెడా మండల ప్రజా పరిషత్ పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు రంగయ్య కడెర్ల, సిద్దిపేట ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామస్వామి పయ్యావులకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు పురస్కారం దక్కింది.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు ఉపాధ్యాయులకు పురస్కారం లభించింది. విశాఖపట్నం జిల్లా ఎస్.రాయవరం మండలం లింగరాజుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు కొణతాల ఫణిభూషణ్ శ్రీధర్, చిత్తూరు జిల్లా ఎం.పాయిపల్లి ఐరాల జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఎస్.మణిరెడ్డి పురస్కారాలకు ఎంపికయ్యారు. సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.
మంత్రి హరీశ్‌రావు అభినందనలు
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుకు ఎంపికైన సిద్దిపేట ఇందిరానగర్ జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు రామస్వామిని ఆర్థికమంత్రి హరీశ్ రావు అభినందించారు. ఉపాధ్యాయ వృత్తిని సామాజిక సేవగా భావించి సేవలందించినందుకు దక్కిన గౌరవంగా మంత్రి పేర్కొన్నారు. నిరుపేద విద్యార్థులకు అత్యుత్తమ విద్య అందించేందుకు రామస్వామి చూపిన తపన, సంకల్పానికి ఈ అవార్డు నిదర్శనమన్నారు. పాఠశాలలోని ఉపాధ్యాయుల సమిష్టి కృషి.. ఐక్యత ఈ అవార్డు రావడానికి దోహదపడిందన్నారు.
ఇదీ చదవండి: రసాయనాలతో కూడిన విగ్రహాలు నిమజ్జనం చేయకుండా చర్యలేంటి?: హైకోర్టు