సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో ఇసుక మాఫియా దందాను అరికట్టడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపిస్తూ మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి ప్రజాసంఘాల నాయకులు వినతి పత్రం సమర్పించారు. అక్కన్నపేట మండలంలో ఇసుక మాఫియాను అరికట్టాలని గతంలో అధికారులకు వినతిపత్రాలు ఇస్తే... రెండు మూడు రోజులు తూతూ మంత్రంగా చర్యలు తీసుకున్నారని తర్వాత యథావిధిగా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోందని తెలిపారు.
ఇసుక మాఫియాతో అధికారులు కుమ్మక్కై గ్రామాల్లో ఏజెంట్లను నియమించుకొని ట్రిప్పుకు కొంత దండుకుంటున్నారని ఆరోపించారు. మామూల్లు ఇవ్వని జనగామ గ్రామానికి చెందిన వడ్డెర ట్రాక్టర్ యజమానులను భయాందోళనలకు గురి చేస్తూ దాడులకు సైతం పాల్పడుతున్నారన్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లోని దృశ్యాలను పరిశీలిస్తే... ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటల తర్వాత గ్రామాల్లో ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా ఏ విధంగా జరుగుతుందో చూడవచ్చన్నారు. దాడులకు గురైన కుటుంబాలకు న్యాయం చేయాలని, ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక మాఫియాను అడ్డుకోవాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: 'వానాకాలంలో పంట మార్పడి చేద్దాం.. యాసంగిలో మక్కలు వేద్దాం'