వేములఘాట్‌లో భూసేకరణపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుమారు 300 మంది స్థానికులు 2018లో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్ల అభ్యంతరాలను పరిశీలించి.. వారికి లిఖిత పూర్వక సమాధానాలు ఇచ్చిన తర్వాతే భూసేకరణ చేయాలని అప్పుడు హైకోర్టు ఆదేశించింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించి తమ భూములను అధికారులు స్వాధీనం చేసుకునే ప్రక్రియ నిర్వహిస్తున్నారని 12 మంది గతేడాది మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు.
కోర్టు ధిక్కరణ వ్యాజ్యంగా విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం... సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, గతంలో సిద్దిపేట పాలనాధికారిగా పని చేసిన.. ప్రస్తుత సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్, సిద్దిపేట ఆర్డీఓ జయచందర్ రెడ్డికి శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఆర్డీఓ జయచంద్రారెడ్డికి రెండు నెలల జైలు, 2వేల రూపాయల జరిమానా విధించింది. ఐఏఎస్‌లు వెంకట్రామిరెడ్డి, కృష్ణ భాస్కర్‌కు ఒక్కక్కరికి 2వేల రూపాయల చొప్పున జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో నాలుగు నెలల జైలు శిక్ష అనుభవించాలని పేర్కొంది. అధికారుల సర్వీసు రికార్డుల్లోనూ నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
ప్రతీ పిటిషనర్‌కు ముగ్గురు అధికారులు ఒక్కొక్కరు రెండు వేల రూపాయల పరిహారం చెల్లించాలని ధర్మాసనం ఆదేశించింది. ఆర్డీఓ జయచంద్రారెడ్డి... అప్పిల్ చేసుకునేందుకు శిక్ష అమలును నాలుగు వారాల పాటు నిలిపివేసింది. మల్లన్నసాగర్ భూసేకరణ కోసం గతేడాది జారీ చేసిన ఉత్తర్వులతో పాటు... 2017లో ప్రకటించిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను కూడా హైకోర్టు రద్దు చేసింది.