Veera Bairanpally revolt : బ్రిటిష్ పాలన నుంచి దేశానికి స్వాతంత్ర్య లభించినా తెలంగాణ మాత్రం స్వేచ్ఛ వాయువులు పీల్చుకోలేదు. స్వతంత్ర రాజుగా ప్రకటించుకుని ఏడో నిజాం పాలన కొనసాగించాడు. రజాకార్ల ఆగడాలు పెచ్చుమీరిపోయాయి. అప్పుడే.. అణిచివేత నుంచి మొదలైంది... కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సాయుధ రైతాంగ పోరాటం. ఆ పోరులో సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని బైరాన్‌పల్లి నెత్తుటి చరిత్ర... ఎన్నటికీ మరువలేనిది.
Special Story on Veera Bairanpally revolt : రజాకార్ల నుంచి తమ గ్రామాన్ని రక్షించుకోవాలనే లక్ష్యంతో బైరాన్‌పల్లి గ్రామస్థులంతా ఐక్యమయ్యారు. శుత్రువులు తమ గ్రామంలోకి వస్తే వారిపై దాడి చేయడానికి ఊరి మధ్యలో శిథిలావస్థలో ఉన్న కోట బుర్జును పునర్‌నిర్మించారు. నాటు తుపాకులు, మందు గుండు సామాగ్రి సమకూర్చుకున్నారు. ఆయుధ శిక్షణ తీసుకున్న యువకులు నాటు తుపాకులతో అనునిత్యం గస్తీ నిర్వహించేవారు. బైరాన్‌పల్లి సమీపంలోని లింగాపూర్ గ్రామంపై దాడి చేసి దోచుకుని వెళ్తున్న రజాకార్లపై దాడి చేసి సొత్తు స్వాధీనం చేసుకున్నారు. తిరిగి దానిని ప్రజలకు పంచిపెట్టారు.
Special Story on Bairanpally revolt : తమపై దాడి చేసిన బైరాన్‌పల్లిపై రజాకార్లు ప్రతికారంతో రగిలిపోయారు. తొలిసారి దాడి చేయగా.. గ్రామ రక్షక దళం చేతిలో చావుదెబ్బతిని 20 మందిని కోల్పోయారు. రెండోసారీ రజాకార్లకు ఓటమి తప్పలేదు. కాసీం రజ్వీ పర్యవేక్షణలో మూడోసారి దాడికి ప్రణాళిక సిద్ధం చేసుకుని బైరాన్‌పల్లిపై 500 మంది సైనికులతో తెగబడ్డారు. 1948 ఆగస్టు 27న రక్తపాతం సృష్టించారు. 96 మంది యువకులను చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారు. మహిళల్ని వివస్త్రలను చేసి బతుకమ్మ ఆడించారు. వారిపై అత్యాచారాలకు ఒడిగట్టారు. రజాకార్ల చేతిలో పడకుండా కొందరు మహిళలు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
బైరాన్‌పల్లి పక్కనే ఉన్న కూటిగల్లుపైనా దాడి చేసిన రజాకార్లు.. 22మందిని పొట్టన పెట్టుకున్నారు. గ్రామంలో ఏటూ చూసినా శవాలే దర్శనమిచ్చాయి. దహన సంస్కారాలు కూడా చేయలేని పరిస్థితుల్లో.. మృతదేహాలన్నింటిని గ్రామస్థులు ఓ పాత బావిలో పడేశారు.
బైరాన్‌పల్లి, కూటిగల్లు నరమేధం జరిగిన 21 రోజుల్లో హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో వీలినమైంది. రజాకార్ల దుర్మార్గాలు భారత ప్రభుత్వం దృష్టికిచేరడంతో.. నాటి హోం మంత్రి వల్లభాయ్ పటేల్ పోలీస్ యాక్షన్‌కు దిగారు. సాయుధ పోరాటానికి సాక్ష్యం నిలించిన బైరాన్‌పల్లి... వీర బైరాన్‌పల్లి అయ్యింది. ఐతే.. స్వరాష్ట్రంలోనూ తమ ఊరిని ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 28 మందికి మాత్రమే పెన్షన్ మంజూరు చేశారని.. మరో 15 మంది వరకు ఉన్నారని చెబుతున్నారు.