సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్‌లో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్ 2015 సంవత్సరం నాటికిి అన్ని సర్కార్ బడుళ్లాగే సాధారణంగా ఉండేది. ప్రైవేటు పాఠశాలల ప్రభావంతో విద్యార్థుల సంఖ్య రోజురోజుకీ తగ్గిపోయింది. నాణ్యమైన విద్యనందిస్తూ, విద్యార్థులను వారి తల్లిదండ్రులను ప్రభుత్వ పాఠశాలలకు రప్పించడం కోసం ఆ పాఠశాల యాజమాన్యం ప్రణాళికలు రూపొందించింది. మాజీ మంత్రి హరీశ్‌రావు, ఉపాధ్యాయుల సమష్టి కృషితో ప్రభుత్వ పాఠశాల అంటే ఇలా ఉంటుందా అనే రీతిలో ఆ బడి రూపురేఖలు తీర్చిదిద్దారు.
పది కమిటీలతో పకడ్బందీ ప్రణాళిక
మొదట విద్యుత్, కంప్యూటర్లు, అదనపు తరగతి గదులు వంటి మౌలిక వసతులు కల్పించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులతో ఆహార, హాజరు, విద్యా సంవత్సరం, ఆటలు, సాంస్కృతిక, పారిశుద్ధ్యం, క్రమశిక్షణ వంటి పది కమిటీలు వేశారు. వీటి ద్వారా పాఠశాల నిర్వహణ పకడ్బందీగా తయారు చేశారు. దీనివల్ల క్రమంగా పరిస్థితుల్లో మార్పు వచ్చింది. విద్యార్థుల సామర్థ్యాలు పెరిగాయి. ప్రైవేటు పాఠశాలల నుంచి సైతం వచ్చి విద్యార్థులు ఈ పాఠశాలలో చేరుతున్నారు. గత రెండేళ్లుగా పాఠశాల ప్రారంభం రోజే 'నో అడ్మిషన్' బోర్డు పెట్టే స్థాయికి ఎదిగింది.
వారి పిల్లలు ఇక్కడే!
కార్పొరేటు పాఠశాలలకు దీటుగా డిజిటల్ క్లాస్ రూం, పరిశోధనశాలలు, కంప్యూటర్ ల్యాబ్‌లు వంటి మౌలిక వసతులు కల్పించారు. ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధతో విద్యాబోధన చేస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి.. వారు కూడా ఇతర విద్యార్థులతో సమానంగా ప్రతిభ చూపేలా తయారు చేస్తున్నారు. ఇక్కడ విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయులు కొందరు తమ పిల్లల్ని ఇదే పాఠశాలలో చదివిస్తున్నారు. వీరే కాక ఇతర పాఠశాలలో బోధించే ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు సైతం తమ పిల్లల్ని ఈ పాఠశాలలో చదివిస్తున్నారు..
ఒక్క అడ్మిషన్!
పదో తరగతి ఫలితాల్లో ముగ్గురు విద్యార్థులు 10/10 జీపీఏ సాధించారు. దాదాపు నలభైమందికి తొమ్మిదికి పైగా జీపీఏ వచ్చింది. ప్రస్తుతం ఆరు నుంచి పది తరగతుల వరకు 23 సెక్షన్లలో 1,017మంది విద్యార్థులున్నారు. ఇప్పటికే నో అడ్మిషన్ బోర్డు పెట్టగా.. ఇంకా 200 దరఖాస్తులో పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి తోడుగా.. ఒక్క అడ్మిషన్ అంటూ తల్లిదండ్రులు పాఠశాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అందుబాటులో ఉన్న వనరులను సమగ్రంగా వినియోగించుకొని కార్పొరేటు పాఠశాలలకు దీటుగా నిలుస్తున్న ఇందిరానగర్ జిల్లా పరిషత్ హై స్కూల్.. ఇతర ప్రభుత్వ పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తోంది.
ఇదీ చూడండి: నేడు తెరాస కార్యవర్గ సమావేశం