కొండపోచమ్మ జలాశయానికి గోదావరి జలాలు వచ్చిన నేపథ్యంలో ప్రధాన కాలువ ద్వారా సంగారెడ్డి, రామాయంపేటకు సాగునీరు అందేలా పనులు త్వరగా పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండలోని మిషన్ భగీరథ భవన్లో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ వేణులతో రామాయంపేట కాలువ పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కాలువ భూసేకరణకు కావాల్సిన నిధుల అంశాన్ని ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తీసుకురాగా.,. పెండింగులోని రూ.36 కోట్ల భూసేకరణ నిధులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి విడుదల చేయిస్తానని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుతో మంత్రి ఫోన్లో మాట్లాడారు.
రామాయంపేట కాలువ పనులు నెల రోజుల్లో పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. 54 కిలోమీటర్ల కాలువ మొత్తంలో 40 కిలో మీటర్లు సిద్ధిపేట జిల్లాలో పనులు పూర్తయ్యాయని, పలుచోట్ల అసంపూర్తి బాటిల్ నెక్స్ పనులు పూర్తి చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. మెదక్ జిల్లాలో 14 కిలోమీటర్ల మేర చేపట్టాల్సిన కాలువ పనుల్లో కేవలం 30 శాతం మాత్రమే పూర్తయ్యిందని, ఇంకా 70 శాతం పనులు పూర్తి కావాల్సి ఉందని సమీక్షలో అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. రామాయంపేట కాలువపై 80 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతున్న దృష్ట్యా ప్రత్యేక శ్రద్ధ వహించి కాలువ పనులు వేగవంతంగా జరిగేలా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. చిన్నశంకరం పేట, తూఫ్రాన్, రామాయంపేట మండలాల్లోని కాలువ భూ సేకరణను త్వరితగతిన చేయించాలని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డికి మంత్రి సూచించారు. రామాయంపేట కాలువ నిర్మాణంలో భాగంగా 11 కిలో మీటర్ల మేర పనులు చేపడుతున్న ప్రాంతాన్ని ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో మంత్రి పరిశీలించారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో మరో 199 కరోనా పాజిటివ్ కేసులు... ఐదుగురు మృతి