ప్రజల్లో పచ్చదనం-పరిశుభ్రతపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో 2కే రన్ కార్యక్రమం నిర్వహించినట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ప్రజల్లో చైతన్యం రావాలని ఆకాంక్షించారు. ప్రజలు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన రన్ ఫర్ స్వచ్ఛ సిద్ధిపేట కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అంబేడ్కర్ సర్కిల్ నుంచి ముస్తాబాద్ చౌరస్తా వరకు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన ఆయన... 2కి.మీ పరుగెత్తారు.
స్వచ్ఛ సర్వేక్షన్-స్వచ్ఛ సిద్దిపేట నిరంతర ప్రక్రియ అని... అందుకు నిత్యం నూతన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఇంటింటా చెత్త సేకరణ, నూటికి నూరు శాతం మరుగుదొడ్ల నిర్మాణం, తడి-పొడి చెత్త సేకరణ, పచ్చదనం కోసం మొక్కలు నాటామని వివరించారు. నిరుపేదల కోసం భోజనం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ ఏడాది సిద్దిపేట నం.1 స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు.
2కే రన్లో పాల్గొన్నవారందరినీ మంత్రి అభినందించారు. విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి, ఫారూఖ్ హుస్సేన్, యువతీ యువకులు, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: మరోసారి తెరపైకి డిజిటల్ డోర్ నంబరింగ్..