minister harish rao: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వక.. వడ్లు కొనుగోలు చేయక మోసం చేస్తుందని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద కొండపోచమ్మ జలాశయం నుంచి కూడవెల్లి వాగు, బస్వాపూర్ కాలువకు గోదావరి జలాలను మంత్రి విడుదల చేశారు. కూడవెల్లి వాగు కొత్త దశ దిశ పునర్జన్మ ప్రసాదించి నదికే కొత్త నడకలు నేర్పిన ఘనత సీఎంకే దక్కిందని పేర్కొన్నారు.
"కొండపోచమ్మ ద్వారా చెక్‌డ్యామ్‌లు, చెరువులు జలకళ సంతరించుకుంటున్నాయి. రాష్ట్రంలో తెరాస చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే భాజపా నేతలు విమర్శిస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శలకు తెరాస పనితీరుతోనే సమాధానం చెబుతుంది. ఏడేళ్లలో కేంద్రం రైతులకు, యువతకు ఏంచేసిందో చెప్పాలి."
- హరీశ్ రావు, మంత్రి
దేశంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను కేంద్ర ప్రభుత్వం ఎందుకు భర్తీ చేయడం లేదని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇప్పటికే 1.30లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. ప్రస్తుతం 80 వేల ఉద్యోగాలకు కొద్దిరోజుల్లో నోటిఫికేషన్ రానుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఉద్యోగాలు ఇవ్వక.. వడ్లు కొనుగోలు చేయక మోసం చేస్తుందని మంత్రి మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతుల పంట పొలాల్లోకి నీరు అందుతుందని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డీసీ ఛైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఎల్లుండి టీఆర్ఎస్ఎల్పీ భేటీ... అనంతరం దిల్లీకి సీఎం, మంత్రుల బృందం