పండంటి మగ శిశువుకు జన్మనిచ్చి తీవ్రరక్తస్రావంతో మహిళ మృతి చెందింది. ఆమె బంధువులు గజ్వేల్ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బాపూర్ గ్రామానికి చెందిన అనిత పురిటి నొప్పులతో గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు సాధారణ ప్రసవం జరుగుతుందని చెప్పి ఆమెను నర్సు పర్యవేక్షణలో ఉంచారు. తీవ్రమైన రక్తస్రావంతో పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది.
ప్రసవ సమయంలో అనితకు తీవ్ర రక్తస్రావం అవడం వల్ల వైద్యులు ఆమెను హైదరాబాద్కు తరలించాలని సూచించారు. అంబులెన్సులో తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే బాలింత మృతి చెందింది. సకాలంలో వైద్యుల సరైన వైద్యం అందించకపోవడం వల్లే అనిత మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. తీవ్రమైన రక్తస్రావం జరుగుతున్నప్పటికీ వైద్యులు పట్టించుకోలేదని పరిస్థితి చేజారి పోయిన తర్వాతే ఇతర ఆసుపత్రికి తీసుకెళ్లాలి సూచించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేటకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.