సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దమ్మక్కపల్లిలో విద్యుదాఘాతంతో తండ్రి మృతి చెందగా కొడుకు ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడ్డాడు. దమ్మక్కపల్లి గ్రామానికి చెందిన బండి కిష్టయ్య రోజులాగే పొలంపనులకు వెళ్లాడు. అప్పటికే కిష్టయ్య పొలంలోని విద్యుత్ పంపుసెట్టుకు స్తంభం నుంచి వచ్చే కరెంటు వైరు గాలి దుమారానికి ఎప్పుడో తెగిపడింది. ఈ విషయాన్ని కిష్టయ్య గమనించలేదు. ప్రమాదవశాత్తు తెగిపడిన విద్యుత్ తీగ కృష్ణయ్యకు తగిలింది. విద్యుదాఘాతానికి గురైన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.
పొలానికి వెళ్లిన తండ్రి చాలా సమయం గడిచినా ఇంటికి రాలేదని అతని కుమారుడు మోహన్ పొలం వద్దకు వెళ్ళాడు. తండ్రి కింద పడి ఉన్న విషయం గమనించి ఏం జరిగిందో అన్న ఆందోళనతో తండ్రిని లేపేందుకు దగ్గరికి వెళ్లాడు. మోహన్‌కు కూడా విద్యుత్ షాక్ తగిలింది. అదృష్టవశాత్తూ అతను ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడ్డాడు. విద్యుదాఘాతంతో తండ్రి మృతి చెందిన విషయం తెలుసుకుని కుమారుడు లబోదిబోమంటూ కుటుంబీకులకు సమాచారం అందించాడు. మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుకునూరుపల్లి ఎస్సై సాయిరాం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇవీ చూడండి: శరవేగంగా వైరస్ వ్యాప్తి.. మూడు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిన కేసులు