సిద్దిపేట జిల్లా నారాయణరావు పేట మండలంలోని మల్యాల గ్రామం... ఓ మూలకు విసిరేసినట్టుగా ఉండేది. పరిశుభ్రత, పచ్చదనం అంతంత మాత్రంగానే ఉండేది. 2019లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన పంచాయతీ పాలక బృందానికి ప్రజల కోసం ఎదైనా చేయాలన్న తపన ఉంది. ప్రభుత్వం తీసుకువచ్చిన 30రోజుల ప్రణాళిక కార్యక్రమాన్ని.... తమ తపనకు పునాదిగా మార్చుకున్నారు. గ్రామ రూపు రేఖలు మార్చేందుకు అడుగులు వేశారు.
ప్రతిరోజూ శ్రమదానం..
30 రోజుల ప్రణాళికలో చేపట్టబోయే కార్యక్రమాలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలపై గ్రామస్థులకు మొదట అవగాహన కల్పించారు. ఊరంతా ఒకే తాటి మీదకు వచ్చింది. ప్రతిరోజూ శ్రమదానం చేసి గ్రామాన్ని పరిశుభ్రంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లోంచి వచ్చే చెత్తను తడి, పొడిగా వేరు చేయడం.. చెత్తను ఊరి బయటకు తరలించడంపై సర్పంచి బృందం దృష్టి సారించింది. గ్రామంలో ఏర్పాటు చేసిన మైకుల ద్వారా ప్రతి రోజు అవగాహన కల్పించేవారు. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించడం మొదలు పెట్టారు. తడి చెత్త నుంచి వర్మి కంపోస్టు తయారు చేయడంతో పాటు పొడి చెత్తను రీసైక్లింగ్‌కు పంపిస్తున్నారు.
17రకాల పండ్ల మొక్కలతో ప్రకృతి వనం
పల్లెలో పచ్చదనంపై గ్రామస్థులు ప్రత్యేక దృష్టి సారించారు. అవసరాలకు అనుగుణంగా నర్సరీ ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలోని ప్రతి వీధిలో మొక్కలు నాటారు. గ్రామస్థులందరకీ ఉపయుక్తంగా ఉండేలా 17రకాల పండ్ల మొక్కలతో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మద్యం సీసాలు, ప్లాస్టిక్ బాటిళ్లతో గార్డెన్‌లో ఆకర్షణీయమైన అలంకరణలు చేశారు. వైకుంఠధామాన్ని నిర్మిచుకుని.. అందులోనూ వివిధ రకాల మొక్కలు నాటుకున్నారు.
పెరిగిన బాధ్యత..
గతానికి ఇప్పటికి స్పష్టమైన మార్పు కనిపిస్తోందని గ్రామస్థులు చెబుతున్నారు. పరిశుభ్రతకు మారుపేరుగా గ్రామం మారిందని సంతోషపడుతున్నారు. మహిళలు ఏకతాటిపైకి వచ్చి నడుం బిగించి కృషి చేయడం వల్లే ఇది సాధ్యమైందని గర్వంగా చెబుతున్నారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తికరణ్ పురస్కారంతో తమ బాధ్యతను పెంచిందంటున్న గ్రామస్థులు..మరింత గొప్పగా గ్రామాన్ని తీర్చిదిద్దుకుంటామని చెబుతున్నారు.
ఇవీ చూడండి: దేశంలోనే అతిపెద్ద వజ్రాల గని ఇదే...