తెలంగాణ ప్రభుత్వం ఆరేళ్ల అనతికాలంలోనే నీటిపారుదల రంగంలో అద్భుతాలు సాధించిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. మొత్తంగా 530 టీఎంసీల మేర గోదావరి జలాలను వినియోగించుకునే స్థాయికి చేరామన్నారు. ఇటీవల భవిష్యత్తు వ్యూహాలపై నిర్ణయం తీసుకునేందుకు ఓ సమావేశం నిర్వహించామని, తెలంగాణలో ఎన్ని పంటలు పండుతాయి.. ఏ విధంగా ఆ పంటలు మార్కెట్‌లోకి పోవాలనే అంశాలపై చర్చించామన్నారు.
ఒక ఏడాదికి రూ.లక్ష కోట్ల విలువైన పంటలను మన రైతాంగం పండించబోతోందని తేలిందన్నారు. ఇది చాలా గర్వకారణమన్నారు. కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల ఎఫ్‌సీఐ సీఎండీ డీవీ ప్రసాద్ మాట్లాడుతూ.. దేశంలో 83 లక్షల టన్నుల వరిధాన్యం సేకరిస్తే... అందులో 66 శాతం (53 లక్షల టన్నులు) తెలంగాణ నుంచే వచ్చిందని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. భూగర్భ జలమట్టాలూ పెరుగుతున్నాయన్నారు. డేంజర్ జోన్ నుంచి సేఫ్‌జోన్‌లోకి రాష్ట్రం వస్తోందన్నారు. సాహసోపేతంగా కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టామన్నారు. ఇంకా సీఎం ఏమన్నారంటే..
నేడు పసిడి పంటలతో కళకళ
" ఆరేళ్ల క్రితం వరకు అనాథలాంటి తెలంగాణ.. ‘పల్లెపల్లెనా పల్లేర్లు మొలిసే పల్లెటూళ్లలోనా..’ అంటూ కవులు పాడుకున్న తెలంగాణ... ‘తలాపునా పారుతోంది గోదారి.. మన చేనూ చెలక.. ఎడారి..’ అని సదాశివుడు రాసిన పాటల నేపథ్యం నుంచి.. ఇప్పుడు పసిడి పంటల తెలంగాణ.. ధాన్యపు రాశుల తెలంగాణగా మారుతోంది. ఇది నాకు చాలా సంతృప్తిగా ఉంది. నాతో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఒక మాట చెప్పారు. ‘చంద్రశేఖర్.. జీవితంలో చాలా తక్కువ మంది ఉద్యమాలను ప్రారంభించి ఫలితాన్ని పొందుతారు. ఉద్యమాలు ప్రారంభించిన వారు మధ్యలోనే చనిపోతారు. మిగతా వారి నాయకత్వంలో ఆ ఫలితం వస్తుంది. నీవు అదృష్టవంతుడివి. ఉద్యమాన్ని నువ్వే ప్రారంభించావు... రాష్ట్రాన్నీ సాధించావు’ అని అన్నారు. ఈ రోజు కూడా అనేక శాపాలు, దీవెనలు, కేసులు, కుట్రలు, కుతంత్రాలతో ఎందరో అడ్డంపడ్డా యావత్ దేశమే అబ్బురపడే ఇంజినీరింగ్ అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టాం. 88 మీటర్ల ఎత్తు నుంచి 618 మీటర్ల ఎత్తుకు నీళ్లు వచ్చి ఈరోజు కొండపోచమ్మ సాగర్ నిండుతోంది".
ఇంజినీర్లందరికీ నా సెల్యూట్
" తెలంగాణ వాళ్లకు తెలివి లేదు. పనిచేయరాదు. పరిపాలన రాదన్నారు. మా ఇంజినీర్ల్లు ఎంత శక్తిమంతులో, నైపుణ్యవంతులో చెప్పేందుకు నిదర్శనమే కాళేశ్వరం ప్రాజెక్టు. ఈఎన్‌సీతో పాటు తెలంగాణ ఇంజినీర్ల బృందానికి సెల్యూట్ చేస్తున్నా. మరొక్క విశేషమేంటంటే..మాటల్లో అలకగానే ఉంటది. కానీ చేస్తే తెలుస్తది. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఉపయోగించే విద్యుచ్ఛక్తి దాదాపు 4,800 మెగావాట్లు. ఇది అందుబాటులో ఉండాలి. ఇది మామూలు విషయం కాదు. గతంలో కొడకండ్లలో 400 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటుకే 12 ఏళ్లు పట్టింది. దేశచరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో కొండపోచమ్మ వద్ద 400కేవీ సబ్‌స్టేషన్లు 6.. 220 కేవీ ఏడు.. 132 కేవీ 2.. నిర్మించాం. 521 కిలోమీటర్ల కొత్త లైన్లు కూడా వేశాం. నీటిపారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి, జెన్‌కో, ట్రాన్స్‌కో అధికారులు నిరంతరం శ్రమించారు. విద్యుత్తు శాఖ వారికీ ధన్యవాదాలు. రెవెన్యూ శాఖ కూడా అహోరాత్రులు కృషి చేసి భూసేకరణలో చక్కగా సహకరించారు. దేశంలో చాలా గొప్ప గొప్ప కంపెనీలన్నీ ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యులయ్యాయి. ఎల్‌అండ్‌టీ, షాపూర్‌జీ పల్లోంజి, మేఘా, నవయుగ, కేఎన్నార్, ఏఎమ్మార్ లాంటి అనేక ప్రతిష్ఠాత్మక సంస్థలు వివిధ దశల్లో కలిసి పనిచేశాయి. అందరికీ ధన్యవాదాలు. మండుటెండల్లో వలస కార్మికులూ విశేషమైన కృషి చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో చెమట చుక్కలు వదిలిన వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు." తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్.
వారం రోజుల్లో శుభవార్త
దుమ్ముగూడెం వద్ద 35 టీఎంసీల సామర్థ్యంతో సీతమ్మసాగర్, దేవాదుల ప్రాజెక్టు కోసం 7.5 టీఎంసీలతో సమ్మక్కసాగర్‌ల నిర్మాణాలు పూర్తి కావొస్తున్నాయని కేసీఆర్ తెలిపారు. రైతులందరికీ త్వరలో ఒక తీపి కబురు చెప్పబోతున్నానని ప్రకటించారు. దానికి సంబంధించిన ప్రక్రియ పూర్తయిందని వెల్లడింంచారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రైతులను గొప్ప శుభవార్త అందించబోతున్నామని, వారం రోజుల్లో లెక్కలు తీసి... దేశమే ఆశ్చర్యపడేంత వార్త చెప్తామని పేర్కొన్నారు.
ప్రత్యామ్నాయ గజ్వేల్ పట్టణం ఆవిర్భామవుతోంది
మంత్రి హరీశ్‌రావు, సిద్దిపేట కలెక్టరు వెంకటరామరెడ్డి నాయకత్వంలో కొండపోచమ్మ నిర్వాసితులకు అద్భుతమైన ఇళ్లను నిర్మించి ఇచ్చారని సీఎం కొనియాడారు. నిర్వాసితుల పిల్లలకు ఉద్యోగావకాశాలు లభించేలా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెట్టిస్తామని ప్రకటించారు. గజ్వేల్‌లో 600 ఎకరాల్లో ఆరువేల పైచిలుకు ఇళ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయని, ఇది గజ్వేల్ పట్టణానికి ప్రతిసృష్టి అని తెలిపారు.
కల సాకారమైన వేళ
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఉజ్వల ఘట్టమిది. ఏ లక్ష్యం, గమ్యాన్ని ఆశించి ప్రజలు రాష్ట్రం కోసం పోరాడారో... ఆ కల సంపూర్ణంగా, సాదృశ్యంగా సాకారమైన చరిత్రాత్మక అంశం. ఇది ఒక అపురూపమైన ప్రాజెక్టు. మీరు ఒక్కసారి ప్రాజెక్టు చూసి రండి... నయాగరా జలపాతంలా కనిపిస్తోంది.
- ముఖ్యమంత్రి కేసీఆర్