సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం బంజేరుపల్లే గ్రామంలోని కొత్త కుంటలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను సీపీఐ నేతల బృందం సందర్శించింది. 20రోజులుగా ఉపాధి పనులు జరుగుతున్నప్పటికీ గ్రామంలో జాబ్ కార్డులు లేని కూలీలకు ఇక్కడ పనిలేదంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
గ్రామ పంచాయతీ కార్యదర్శి రెండు సార్లు మాత్రమే పనిచేస్తున్న ప్రదేశానికి వచ్చారని... తమ సమస్యలను పట్టించుకునే వారు లేరని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎర్రటి ఎండలో పనిచేస్తున్న తమకు ఎలాంటి నీడ,తాగు నీటి సౌకర్యం కల్పించలేదన్నారు. ప్రమాదం జరిగితే అత్యవసర ఫస్టెడ్ కిట్ లాంటివి సంబంధిత అధికారులు సరఫరా చేయలేదని సీపీఐ నేతల బృందం ముందు గోడు వెల్లబోసుకున్నారు.
ఉపాధి హామీ కూలీలకు శ్రమకు తగిన ఫలితం రావడం లేదన్నారు సీపీఐ నేత గడిపె మల్లేశ్. బిల్లుల చెల్లింపులో జిల్లా అధికార యంత్రాంగం నిర్లక్ష్యం చేయడం సరికాదని మండిపడ్డారు. జిల్లా కలెక్టర్ వెంటనే కూలీలకు డబ్బులు చెల్లించేలా కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలోనే అధికారుల నిర్లక్ష్యం ఇంతగా ఉంటే... రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. కూలీలను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు గుర్రాల హన్మిరెడి, గ్రామ శాఖ సీపీఐ కార్యదర్శి బింగి సమ్మయ్య, ఎఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జనగాం రాజు కుమార్ తదితరులు పాల్గొన్నారు.