నవంబర్ 3న జరగనున్న దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్ సందర్భంగా అక్కడ చేసిన ఏర్పాట్లను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భారతి హోళికేరి పరిశీలించారు. సిద్దిపేట పట్టణం సమీపంలో గల ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూం వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు. అదే కళాశాలలో ఏర్పాటు చేయనున్న కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. పరిశీలనలో కలెక్టర్ వెంట ఆర్‌డీఓ అనంత రెడ్డి, స్థానిక తహసీల్దార్ ఉన్నారు. అనంతరం పట్టణంలోని ఎలక్ట్రిసిటీ అథితి గృహంలో ఎన్నికల పోలీస్ పరిశీలకులు సరోజ్ కుమార్ ఠాకూర్, వ్యయ పరిశీలకులు నరేష్ బుందేల్, మనీష్ ద్వివేదిలతో కలెక్టర్ భేటి అయ్యారు.
దుబ్బాక ఎన్నికల పోలింగ్‌కు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలకులకు కలెక్టర్ వివరించారు. దుబ్బాక నియోజవర్గం, నైసర్గిక స్వరూపం, జనాభా, విస్తీర్ణం, ఓటర్లు, పోలింగు కేంద్రాల్లో ఏర్పాట్లు, స్వీప్ కార్యక్రమాల నిర్వహణ తదితర సమాచారాన్ని కలెక్టర్ వెల్లడించారు. మద్యం, డబ్బు పంపిణీ లాంటి అక్రమాలను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలను, ఏర్పాటు చేసిన బృందాలు, వాటి పని తీరును వివరించారు.
ప్రచారం కోసం వెచ్చిస్తున్న ప్రతి పైసను అభ్యర్థుల ఖాతాలో జమ చేసేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్ఠంగా అమలుకు కృషి చేస్తున్నామన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు సదుపాయాలను వివరించారు. శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాకుండా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ఇదీ చూడండి: సిద్ధమైన రైతువేదికలు... రేపు లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం