సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ జలాశయ ఎడమ కాలువకు పడిన గండిని కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ హరి రామ్ పరిశీలించారు. ప్రాజెక్టు నుంచి కొండపోచమ్మ వరకు సుమారు 10 పంపుల ద్వారా ఇక్కడికి నీటిని తీసుకువస్తున్నామన్నారు. ఎలాంటి పెద్ద ప్రమాదం జరగలేదని.. కొండపోచమ్మ జలాశయం నుంచి కాలువల ద్వారా నీటి విడుదల చేసినప్పుడు గండ్లు పడతాయని ముందే ఊహించినట్లు స్పష్టం చేశారు.
ఊహించిన దానికంటే ప్రమాదం తీవ్రత తక్కువగానే ఉందన్నారు. కష్టపడి పనిచేసిన ఇంజినీర్లను ప్రోత్సహించాలని ఈ సందర్భంగా హరి రామ్ కోరారు. ప్రస్తుతం ట్రయల్ రన్ నిర్వహించినట్లు.. స్టార్టింగ్ ట్రబుల్స్ సహజమన్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు.