సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం బొడిగపల్లిలో కింద పడిన విద్యుత్ తీగలు తగిలి మేడవేని సారయ్య అనే రైతు వ్యవసాయ క్షేత్రం వద్ద అతని రెండు గేదెలు, ఒక దూడ మృతి చెందాయి. సుమారు లక్షా యాభైవేల రూపాయల నష్టం వాటిల్లడం వల్ల ఆ రైతు కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.
గ్రామంలో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కురిసిన వడగళ్ల వర్షానికి శిథిలావస్థలో ఉన్న విద్యుత్ స్తంభం విరిగిపోయింది. స్తంభానికి ఉన్న విద్యుత్ తీగలు తెగి రైతు పొలంలో పడిపోయాయి. ఈ విషయాన్ని విద్యుత్ అధికారులకు స్థానిక రైతులు తెలియజేయడంతో విద్యుత్ ప్రసరణ నిలిపి వేశారని రైతులు అనుకున్నారు.
మెడవేని సారయ్య గేదెలు, దూడ మేత కోసం అటువైపుగా వెళ్లి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాయి. నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని ఆ కుటుంబం వేడుకుంటోంది.
ఇదీ చూడండి: రేపట్నుంచి 10 రోజులపాటు రాష్ట్రంలో లాక్‌డౌన్