మున్సిపల్ ఎన్నికల్లో తెరాసను ఓడించి తీరుతామని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. తెరాస పాలనలో రాష్ట్రాన్ని అవినీతిమయంగా మార్చారని ఆరోపించారు. ఏడేళ్ల పాలనలో జరిగిన అవినీతిపై ఛార్జ్‌షీట్‌ను సిద్దిపేటలో విడుదల చేశారు. కోమటి చెరువు అభివృద్ధి పేరుతో పేదల డబ్బులను వృథా చేశారని విమర్శించారు. ఆర్థిక శాఖ మంత్రి సిద్దిపేటకు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చి, ఎంత మందికి ఉపాధి కల్పించారో చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో 12 వేల మంది డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు దరఖాస్తు పెట్టుకుంటే కేవలం రెండు వేల మందికి మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు. నరేంద్ర మోదీ కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాత్రికి రాత్రి రోడ్లను నిర్మించారని..అమృత్ పథకం కింద నిధులు దుర్వినియోగం అయ్యాయని తరుణ్ చుగ్ ఆరోపించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.