Biogas production with wet waste: రాష్ట్రంలో తొలిసారి సిద్దిపేట మున్సిపాలిటీలో తడి చెత్త నుంచి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ) ఉత్పత్తికి రంగం సిద్ధమైంది. పట్టణ శివారులోని బుస్సాపూర్ డంపింగ్ యార్డులో రూ.6 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన బయోగ్యాస్ ప్లాంట్‌ని సోమవారం రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు లాంఛనంగా ప్రారంభించనున్నారు. సూదులు, శానిటరీ ప్యాడ్లు, ఔషధ వ్యర్థాలను దహనం చేసేందుకు ఏర్పాటు చేసిన యంత్రాన్ని సైతం ప్రారంభిస్తారు. దీంతో పట్టణంలో ఉత్పత్తి అయ్యే చెత్తను వంద శాతం సద్వినియోగం చేస్తున్న బల్దియాగా సిద్దిపేటకు గుర్తింపు వస్తుంది.
సిద్దిపేట పట్టణంలో 40 వేల కుటుంబాలున్నాయి. నిత్యం 55 మెట్రిక్ టన్నుల చెత్త వెలువడుతోంది. అందులో 30 మెట్రిక్ టన్నులు తడి చెత్త ఉంటోంది. బయోగ్యాస్ తయారీకి 20 మెట్రిక్ టన్నులు సరఫరా చేస్తారు. దీంతో సగటున రోజుకు 350 కిలోల గ్యాస్ ఉత్పత్తి అవుతుందని అధికారులు చెప్పారు. దీనిని 6.2 కిలోల సామర్థ్యం ఉన్న సిలిండర్లలో నింపి వాణిజ్య అవసరాలకు విక్రయించనున్నారు. పదేళ్ల పాటు ఈ ప్లాంట్ నిర్వహణను బెంగళూరుకు చెందిన కార్బన్ మాస్టర్స్ అనే కంపెనీకి అప్పగించారు. ఆదాయంలో 75 శాతం ఆ కంపెనీకి.. 25 శాతం బల్దియాకు సమకూరనుంది.
ఇదీ చదవండి: Elon Musk School: చిన్నవయసులోనే అద్భుత ప్రతిభ.. ఎలాన్ మస్క్ పాఠశాలలో ప్రవేశం