Awarness Program On Plastic Usage: ప్లాస్టిక్ నియంత్రణ కోసం ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఎన్ని చర్యలు, కార్యక్రమాలు చేపట్టిన వాటి వినియోగం తగ్గడం లేదు. కాగా ఇలాంటి అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనడం దండగ అనుకొని ప్రజలు అటు వైపు వెళ్లను కూడా వెళ్లరు. కానీ ఇతను మాత్రం వినూత్నంగా ఆలోచించి ప్రజలకు ఎలా అవగాహన కల్పించాలి వారి చేత ప్లాస్టిక్ వాడకాన్ని ఎలా తగ్గించాలి అనే అంశాలను ప్లాన్ చేసి మరీ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఊర్లో ప్రజలకి అవగాహన కల్పిస్తు, తమ దగ్గర ఉన్న ప్లాస్టిక్ ఇస్తే వెండి నాణేలు ఇస్తూ గ్రామాన్ని ప్లాస్టిక్ రహితం చేసేందుకు కృషి చేస్తున్నారు. పది కిలోల ప్లాస్టిక్ ఇస్తే ఒక తులం వెండి నాణెం బహుమతిగా ఇస్తున్నాడు. ఈ అవగాహన కార్యక్రమాన్ని పది రోజుల పాటు చేయనున్నారని వారు తెలియజేశారు.
అనర్థాలను తెలియజేస్తూ: సిద్దిపేట జిల్లా ములుగు మండలం, క్షీరసాగర్ గ్రామానికి చెందిన కొన్యాల బాల్ రెడ్డి కేబీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామంతో పాటు మండలాల్లో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే తన గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకోసం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. గ్రామ ప్రజలకు, యువకులకు ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను తెలియజేయాలనుకున్నారు.
10 కిలోల ప్లాస్టిక్‌కు తులం వెండి: ప్లాస్టిక్ వాడకంపై గ్రామంలో విస్త్రతంగా ప్రచారం చేస్తూ 10 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను తమ ఫౌండేషన్‌కు ఇస్తే అందుకు బహుమానంగా ఒక తులం వెండి నాణెం బహుమతిగా ఇస్తామంటూ గ్రామంలో ప్రత్యేకంగా దండోరా వేయించారు. దీంతో ప్రజలంతా ప్లాస్టిక్ వాడకం వల్ల అనర్థాల గురించి తెలుసుకొని బాల్‌రెడ్డి అవగాహన కార్యక్రమానికి స్పందించారు. వారంత తమ గ్రామంలో ఉన్న ప్లాస్టిక్‌ను సేకరించి పది కిలోలు ఫౌండేషన్‌కు అప్పగిస్తూ ఒక తులం వెండిని నాణెంను బహుమతి తీసుకుంటున్నారు.
ఇప్పటి వరకు 400కిలోల ప్లాస్టిక్: గ్రామస్థుల నుంచి మంచి స్పందన లభించడంతో ఇప్పటివరకు 400 కిలోల ప్లాస్టిక్‌ను సేకరించారు. ఈ విధంగా గ్రామంలో ఉన్న ప్లాస్టిక్ వాడకం తగ్గుతుంది. ప్రజలకు అవగాహన పెరుగుతుందని వారు ఆలోచించారు. ప్లాస్టిక్ అంతమే తన లక్ష్యమని ప్లాస్టిక్ రహిత గ్రామాన్ని తీర్చిదిద్ది రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందడమే లక్ష్యమని బాల్‌రెడ్డి చెబుతున్నారు.
ఇవీ చదవండి: