సిద్దిపేట జిల్లా అక్కన్నపేట కాల్పుల ఘటనలో విస్మయకర కోణాలు వెలుగుచూస్తున్నాయి. పొరుగింటి వ్యక్తి గుంటి గంగరాజు కుటుంబంతో చోటుచేసుకున్న వివాదంలో ఏకే-47 రైఫిల్‌తో సదానందం కాల్పులు జరిపిన వ్యవహారం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సదానందం ఈ నెల 5న రాత్రి 8 గంటల సమయంలో తన ఇంట్లో ఉన్న ఏకే-47తో కాల్పులు జరపాలనుకున్నాడని విశ్వసనీయ సమాచారం. ముందుగా ఒక రౌండు కాల్చేందుకు ప్రయత్నించడంతో సాధ్యం కాలేదు. చాలా రోజులపాటు వినియోగంలో లేకపోవడంతోపాటు విడిభాగాలు సరిగ్గా లేకపోవడం వల్ల అది పేలలేదు.
కొబ్బరి నూనెతో రాత్రంతా శుభ్రం చేశాడు...
సదానందం అదే రోజు రాత్రి ఆయుధాన్ని సంచిలో దాచుకొని కోహెడ మండలంలోని బస్వాపూర్‌కు వెళ్లి కొబ్బరినూనె కొనుగోలు చేశాడు. అనంతరం బస్వాపూర్ గుట్టపైకి వెళ్లి రాత్రంతా ఆయుధాన్ని శుభ్రం చేశాడు. మరుసటి రోజు రాత్రి ఇంటి వద్ద ఒక రౌండ్ కాల్చి పరీక్షించాడు. సరిగ్గానే పేలింది. దీంతో శత్రువైన గంగరాజు ఇంటికి బయలుదేరాడు. అప్పటికే గంగరాజు అప్రమత్తమై.. ఇంటి లోపలివైపు గడియ పెట్టుకున్నాడు. సదానందం ప్రహరీ దూకి లోపలికి వెళ్లే క్రమంలో గోడ తగిలి ఏకే-47 మేగజైన్‌లో నుంచి ఓ తూటా కింద పడిపోయింది. కిటికీ తెరిచి ఉండటం వల్ల సదానందం కిటికీలో నుంచే ఓ రౌండ్ కాల్చాడు. కానీ, గురి తప్పింది. అనంతరం అక్కడినుంచి పారిపోయి... మరుసటిరోజు కొహెడ బస్‌స్టాండ్‌లో పోలీసులకు దొరికిపోయాడు.
కొంరవ్వతో గొడవ...
మొదటి భార్యతో విడిపోయిన సదానందం.. 2014లో సిద్దిపేట జిల్లా నంగునూరుకు చెందిన కృష్ణవేణిని వివాహం చేసుకుని అక్కన్నపేటలో కాపురం పెట్టాడు. కృష్ణవేణి పేరిట లక్ష రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయాలని ఆమె కుటుంబసభ్యులు పెళ్లి సమయంలో షరతు విధించారు. అయితే, బ్యాంకు కంటే ఎక్కువ వడ్డీ ఇస్తానని గొట్టె కొంరవ్వ అనే మహిళ చెప్పగా... ఆ మొత్తాన్ని సదానందం ఆమెకు అప్పుగా ఇచ్చాడు. ఆమె మోసం చేయడం వల్ల హుస్నాబాద్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. అనంతరం జరిగిన పలు సంఘటనలతో సదానందం మనస్థాపానికి గురై కక్ష పెంచుకున్నాడు.
ఆయుధాలెక్కడినుంచి వచ్చాయ్...
తన వద్దే ఆయుధం ఉంటే వారిని చంపేయొచ్చని సదానందం భావించాడు. అదను చూసి ఠాణాలోని ఏకే-47, కార్బైన్‌ను అపహరించాడు. అయితే కొంరవ్వ డబ్బులు తిరిగి ఇవ్వడం వల్ల అప్పట్లో కాల్పుల కుట్రను విరమించుకున్నాడు. తాజాగా గంగరాజు కుటుంబసభ్యులతో వివాదం నేపథ్యంలో ఎలాగూ ఆయుధం ఉందికదా అని కాల్పులకు తెగబడ్డాడు.
ఇవీ చూడండి: అక్కన్నపేటలో కాల్పుల కలకలం