జర్నలిస్టును దూషిస్తూ భావప్రకటన స్వేచ్ఛను కాలరాసే అధికారం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి ఎవరిచ్చారని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ అన్నారు. విలేకరిపై ఎమ్మెల్యే అభ్యంతర వాఖ్యలను నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు జాతీయ రహదారిపై టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
* కాంగ్రెస్ పార్టీ ఖండన:
విలేకరులకు స్వేచ్ఛ కొరవడిందని.. ఎమెల్యే మహిపాల్ రెడ్డి బెదిరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జి కాట శ్రీనివాసగౌడ్ పేర్కొన్నారు. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాల్సింది పోయి ఫోన్ చేసి దుర్భాషలాడటం సరికాదన్నారు. సంతోష్ నాయక్‌కు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు.
*ఉనికి చాటుకోవడానికే:
ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేక తమ ఉనికి చాటుకోవడానికి భాజపా చవకబారు రాజకీయాలు చేస్తోందని నూతన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ అన్నారు. జర్నలిస్టులు, జర్నలిజం అంటే తమకు, తెరాసకు, తమ నాయకుడికి అపార గౌవరం అని.. కొందరు వ్యక్తులు తమ స్వార్థప్రయోజనాల కోసం ఎల్లో జర్నలిజానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంతోష్ నాయక్ అనే విలేకరి సొంత అజెండాతో ఒక పార్టీ నాయకుడు సూచనలకు అనుగుణంగా స్థానిక ఎమ్మెల్యేపై దుష్ప్రచారం చేస్తూ వార్తలు ప్రచురించడం ఎంతవరకు సమంజసం అన్నారు. నిత్యం ప్రజా సంక్షేమ కోసం తపనపడే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి పటాన్‌చెరు నియోజకవర్గం మొత్తం అండగా నిలుస్తుందని తెలిపారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో రేపట్నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు