తెలంగాణ గురించి కనీస అవగాహన లేని వారు రాష్ట్రంపై విమర్శలు చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎవరో వచ్చి తెలంగాణలో రైతు సంతోషంగా లేడని అంటున్నారని.. వారికి రాష్ట్రంపై కనీస పరిజ్ఞానం ఉందా అని ప్రశ్నించారు. ఏపీలో రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మాత్రమే ఇస్తుంటే... తెలంగాణలో కేంద్రం నిధులతో పాటు రైతుబంధు పేరుతో అదనంగా ఎకరాకు పదివేల రూపాయలు అందిస్తున్నామన్నారు.
సంగారెడ్డి జిల్లా కందిలో మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. కందిలో రైతు వేదికను ఆయన ప్రారంభించారు. రైతు వేదికలు... రైతుల ఆత్మగౌరవ భవనాలుగా మంత్రి అభివర్ణించారు. కాంగ్రెస్ హయాంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని... తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు భాజపా పాలిత రాష్ట్రాల్లో కూడా లేవని హరీశ్‌రావు అన్నారు. బడ్జెట్లో సింహభాగం వ్యవసాయ రంగానికే కేటాయిస్తామని మంత్రి తెలిపారు. కూరగాయలు, పండ్ల సాగుపై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు.
ఇదీ చూడండి: త్వరలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తాం: కేసీఆర్