రేపు జరగబోయే జాతీయ లోక్ ఆదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంగారెడ్డి జిల్లా న్యాయసేవాధికారి పాపిరెడ్డి సూచించారు. గతంలోనూ సుమారు 1600 కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించామని తెలిపారు. రేపు జరగబోయే లోక్ ఆదాలత్లో కక్షిదారులు పాల్గొని అన్ని రకాల కేసులను పరిష్కరించుకోవచ్చని వెల్లడించారు.
కేసులు రాజీ అయ్యేలా చూడాలని పోలీసులు, అడ్వకేట్లకు ఆయన సూచించారు. సివిల్, వాహనాలు, మాట్రిమోని, భూ తగాదా కేసులకు సంబంధించి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో కోర్టు ఆవరణలో వైరస్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించామన్నారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్కును ధరించాలని ఆయన సూచించారు. కక్షిదారులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు సెషన్స్ జడ్జి కర్ణ కుమార్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆశాలత పాల్గొన్నారు.