Minister HarishRao At Public Meeting in Narlapur: రైతులు ముఖాన్ని ఆకాశానికి చూసే అవసరం లేకుండా ముఖ్యమంత్రి కాళేశ్వరం జలాలను తాగునీటికి, సాగునీటికి అందిస్తున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. నిజాంపేట మండలం నార్లాపూర్ వద్ద బొల్లికుంట చెరువులోకి గోదావరి జలాలను వదిలారు. ఈ సందర్భంగా నార్లాపూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు.
కరీంనగర్ జిల్లాలోని మేటిగడ్డ నుండి 530 మీటర్ల ఎత్తున గోదావరి జలాలను ఎత్తిపోస్తూ 310 కిలోమీటర్ల దూరంలో ఉన్న నార్లాపూర్‌కు నీటిని తీసుకువచ్చామని ఆయన అన్నారు. ఇక బోర్లు, బావులలో ఊట పెరుగుతుందని, ఎప్పుడు కాల్వలో నీటి ప్రవాహం ఉంటుందని, చెరువులు, కుంటలు నింపుకోవడం ద్వారా రెండు పంటలు పండించుకోవచ్చని తెలిపారు. రైతులు 365 రోజులు కడుపునిండా తినవచ్చు అన్నారు.
కేంద్ర ప్రభుత్వం తిరకాసు పెడుతోంది: బోరు బావి కాడ మీటర్లు పెడితే రూ.30 వేల కోట్లు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం తిరకాసు పెడుతుందని, బడ్జెట్లో నిధులు కొత పేడుతున్నదని, అయినా రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కాంక్షించి ఉచిత విద్యుత్ అందిస్తున్నదని హరీశ్ అన్నారు. ప్రభుత్వం సంపద సృష్టించి అందరికి పంచుతుంటే కేంద్రం నిందలు వేస్తోందని, బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని కాంక్షించి ప్రభుత్వం ఆసరా, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ వంటి పథకాలు అందిస్తున్నదని వివరించారు.
ప్రారంభించిన కొద్ది సేపట్లోనే.. గండి పడింది: ప్రారంభం చేసిన కొద్ది గంటల్లోనే గండిపడింది. మహంకాళి సమీపంలో కాలువ కోతకు గురైంది. సుమారు మీటర్ మేర కోతకు గురై నీరంతా బయటకు వచ్చేసింది. ఫలితంగా పలువురు రైతుల పొలాల్లోకి నీరు చేరింది. కొత్తగా నాట్లు వేసిన పొలాలన్ని నీటితో మునిగిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు నాసిరకం పనుల వల్లే కాలువకు గండిపడిందని బీజేపీ నేతలు ఆరోపించారు. నష్టపోయిన రైతులకు సాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: