అమీన్‌పూర్‌లోని మారుతీ హోంలో బాలికపై అత్యాచారం జరిగినట్లు హైపవర్ కమిటీ ప్రాథమికంగా తేల్చింది. ఈ మేరకు తగిన ఆధారాలు, సాక్ష్యాలు సేకరించిన హైపవర్ కమిటీ సభ్యులు నివేదికను రూపొందించి... మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మిషనర్‌కు ప్రాథమికంగా సమర్పించారు. విచారణ సందర్భంగా సేకరించిన పత్రాలన్నింటిని నివేదికకు జత చేశారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు వచ్చిన తర్వాత.... బాలిక మృతికి గల కారణాలు విశ్లేషించి మరో వారం రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించే అవకాశం ఉంది.
మారుతి హోమ్‌కు చెందిన బాలిక గత నెల 12న నీలోఫర్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. అంతకుముందు బాలిక... తనపై వెంకటేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి పలు మార్లు మారుతీ హోంలో అత్యాచారం చేసినట్లు బంధువులకు తెలిపింది. బంధువులు బాలికను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు వెంకటేశ్వర్ రెడ్డితో పాటు... హోం నిర్వాహకులు విజయ, ఆమె సోదరుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
బాలిక పూర్తిగా అనారోగ్యం పాలవడంతో నీలోఫర్ ఆస్పత్రిలో చేర్చించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై ఆగస్టు 13న మహిళాభివృధి శాఖ కమిషనర్ హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు. హోంకు వెళ్లి విచారణ చేయడంతో పాటు... అందులో ఉన్న పిల్లల నుంచి కమిటీ సభ్యులు పలు కీలక ఆధారాలు సేకరించారు. ఒంటిపై వస్త్రాలు లేకుండా ఉన్న సమయంలో తోటి పిల్లలు వచ్చి దుస్తులు వేశారని బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కమిటీ సభ్యులు బాలిక స్నేహితుల ద్వారా ఈ విషయాన్ని నిర్ధరించుకున్నారు. ఈ అంశాలతో కూడిన పత్రాలను జత చేస్తూ నివేదికను ఈ నెల 14న కమిషనర్‌కు కమిటీ సభ్యులు అందజేశారు.