లాక్‌డౌన్ వేళ రేషన్ కార్డులున్నవారికి సర్కారు ఒక్కో వ్యక్తికి 12కిలోల బియ్యంతో పాటు రూ.1,500లు అందిస్తుంది. గతనెలలో బ్యాంకు ఖాతాల్లో నగదు జమైనా చాలా మంది వాటిని తీసుకోలేకపోయారు. ఈ గందరగోళంతో పాటు ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్లడమూ కారణమైంది. ఇలాంటి వారంతా బ్యాంకుల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఏ ఖాతాలో పడ్డాయో తెలియక ఇబ్బంది పడుతున్నారు.
రేషన్ బియ్యం తీసుకున్న అంజయ్య తన బ్యాంకు ఖాతాలో రూ.1,500 జమయ్యాయని తెలుసుకుని వరుసలో నిలబడ్డారు. వోచరు రాసుకొని తన వంతు కోసం నిరీక్షించారు. తీరా బ్యాంకు సిబ్బంది ఆ ఖాతాలో నగదు జమకాలేదని చెప్పడంతో సమయమంతా వృథా అయింది. దీంతో తనకున్న మరో ఖాతాలో డబ్బులు పడి ఉంటాయోమోనని అక్కడికి పరుగుతీశారు. బ్యాంకు సిబ్బందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. వారు సహకరించకపోవడం వల్ల ఏ ఖాతాలో డబ్బులు పడ్డాయోనని ఆందోళనకు గురయ్యారు. సంగారెడ్డి జిల్లాలోని చాలా మంది లబ్ధిదారులది ప్రస్తుతం ఇదే పరిస్థితి. దీనిని గమనించిన అధికారులు అప్రమత్తమయి ఏ బ్యాంకు ఖాతాలో జమయ్యాయనే విషయాన్ని కార్డుదారులకు చెబుతున్నారు.
రేషన్ కార్డు నంబరుతో...
రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం అందిస్తున్న రూ.1500 నగదు ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంకు ఖాతాలో ఈ నగదు జమవుతోంది. చాలామందికి ఈ విషయంలో తికమక పడుతున్నారు. దీనిని నివారించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రేషన్ కార్డు నంబరు తీసుకుని స్థానిక తహసీల్దారు కార్యాలయానికి వెళితే చాలని అంటున్నారు. ఆ నంబరు ఆధారంగా ఈపాస్ వెబ్‌సైట్‌లో వివరాలు చూసి తెలుసుకోవచ్చంటున్నారు. ఒకవేళ ఆధార్‌తో ఏ ఖాతా అనుసంధానం కాకపోయినా, ఇతర ఏవైనా సమస్యలుంటే వారి పరిధిలోని తపాలాలో నగదు తీసుకోవచ్చని అధికారులు వివరిస్తున్నారు.
కలెక్టరేట్‌లోనూ ఏర్పాటు...
కలెక్టరేట్‌లోనూ ఇందుకోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు. ప్రధాన గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ గదిలో ఇద్దరు సిబ్బందికి ఈ బాధ్యతలు అప్పగించారు. పౌరసరఫరాల శాఖకు చెందిన వీరు తమ వద్దకు వచ్చిన వారికి ఏ ఖాతాలో నగదు జమయ్యాయో చెబుతున్నారు. గతనెల 21వ తేదీ నుంచి ఇలాగే చెబుతున్నామని అక్కడ పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు వివరించారు. రోజూ దాదాపు 200 మంది వరకు వస్తున్నారని తెలిపారు.
భౌతిక దూరాన్ని పాటిస్తే మేలు...
నగదు తీసుకునేందుకు బ్యాంకుల వద్ద జనం అధిక సంఖ్యలో జమైతున్నారు. ఎలాగైనా సరే అదే రోజు నగదు తీసుకుని వెళ్లాలని భావిస్తున్నారు. భౌతిక దూరాన్ని మరిచిపోతున్నారు. ప్రధానంగా మహిళలు, వృద్ధులే ఎక్కువగా ఇక్కడికి వస్తున్నారు. దీంతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఇటీవల సదాశివపేట ఎస్‌బీఐ వద్ద దాదాపు అయిదుగంటలపాటు విపరీతమైన రద్దీ కనిపించింది. చాలా మంది మాస్కులూ ధరించలేదు. ఒకరినొకరు తోసుకుంటూ డబ్బులు తీసుకునేందుకు ఆరాటపడ్డారు. అధికారులు తగిన జాగ్రత్తలు పాటించేలా చూస్తే మేలు.
సమాచారం తెలుసుకుంటే ఇబ్బందులు ఉండవు...
ఏ ఖాతాలో నగదు జమైందోనని బ్యాంకుల చుట్టూ తిరగకండి. స్థానిక తహసీల్దారు కార్యాలయానికి వెళ్తే మీకు సమాచారం ఇస్తారు. మీకు వచ్చిన డబ్బులు మళ్లీ వెనక్కిపోవు. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. బ్యాంకుల వద్ద ఒకేసారి గుమిగూడితే వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. వరుసలో నిల్చొనే సమయంలోనూ భౌతిక దూరం పాటించండి. మాస్కులూ తప్పనిసరిగా ధరించండి.
-శ్రీకాంత్ రెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి
గణాంకాలిలా...
- మొత్తం రేషన్‌కార్డులు- 3,72,864
- నగదు పొందేందుకు అర్హత ఉన్న కార్డులు- 3,23,382
- ఇప్పటి వరకు నగదు జమయిన కార్డులు- 3,23,323
- జిల్లాలో జమ చేసిన మొత్తం- రూ.48.49 కోట్లు