మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశం కోసం బుధవారం ప్రవేశ పరీక్ష జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో సీటు కోసం ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి 3510 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాసేందుకు వస్తారు. పరీక్ష నిర్వహణ కోసం 22 మంది చొప్పున చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ అధికారులు, ప్రత్యేక పరిశీలకులను నియమించారు. ఈ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసేందుకు బీసీ గురుకులాల ఆర్‌సీవో.. జిల్లా విద్యాధికారిణి, డీఆర్‌డీవోలకు ఆదేశాలు ఇచ్చారు.
పోటీ ఎక్కువే..
గురుకుల కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపులు ఉన్నాయి. ఒక్కో గ్రూపులో 40 మంది విద్యార్థుల చొప్పున ఒక్కో కళాశాలలో 160 సీట్లు ఉన్నాయి. నాలుగు కళాశాలల్లో 640 సీట్లకు 2743 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. ఒక్క సీటుకు నలుగురు విద్యార్థులు పోటీ పడుతున్నారు. వర్గల్‌లో డిగ్రీ బాలికల కళాశాల ఉంది. 220 సీట్లకు 567 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇక్కడ ఒక్కో సీటుకు దాదాపు ముగ్గురు విద్యార్థులు పోటీ పడుతున్నారు.
కొవిడ్ నేపథ్యంలో ప్రత్యేక సూచనలు
- పరీక్ష కేంద్రానికి గంట ముందుగా చేరుకోవాలి. అరగంట ముందు నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు.
- బాల్ పాయింట్ పెన్ను మాత్రమే తీసుకురావాలి.
- ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు.
- పరీక్ష రాసేందుకు వచ్చే విద్యార్థులు మాస్కు తప్పని సరిగా ధరించాలి. వెంట తాగునీటి సీసా తెచ్చుకోవాలి.
- కొవిడ్ లక్షణాలు కనిపించే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా గదులు కేటాయిస్తారు.
- పరీక్ష కేంద్రంలోకి వెళ్లే సమయంలో భౌతిక దూరం పాటించాలి. తరగతి గదులను పరీక్షకు ముందే శానిటైజ్ చేయిస్తారు.
అన్ని ఏర్పాట్లు చేశాం..
బీసీ గురుకుల కళాశాలల్లో ప్రవేశం కోసం బుధవారం నిర్వహించే పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. విద్యార్థులు గంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. దూరం నుంచి వచ్చే వారు మరింత అప్రమత్తమై కేంద్రానికి ముందుగా చేరుకునేలా ప్రణాళిక చేసుకోవాలి. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశాం. కొవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి. ప్రభాకర్, బీసీ గురుకులాల ప్రాంతీయ సమన్వయకర్త
ఇవీ చూడండి: ఈసెట్ అభ్యర్థులకు మొదటి విడత సీట్ల కేటాయింపు