Venkaiah Naidu Speech at Swarna Bharat Trust in Rangareddy : అత్యంత శక్తిమంతమైన భారతావని నిర్మాణానికి పేట్రియాటిజం ఎంత ముఖ్యమో.. న్యూట్రీషినిజం అంతే ముఖ్యమని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య శిబిరం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వర్ణభారత్ ట్రస్టులో స్వయం ఉపాధి శిక్షణ కోర్సులు పూర్తి చేసుకున్న యువతకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. దేశభక్తి ఒక ఉద్యమంగా ఎగసి స్వరాజ్యాన్ని సాధించుకున్నామని.. ఇప్పుడు సురాజ్యం దిశగా పయనం సాగిస్తున్నామని తెలిపారు. ఇందుకు పౌష్టికాహార ఉద్యమం చాలా అవసరమని స్పష్టం చేశారు.
Venkaiah Naidu Talk about Nutrition : ఈ దిశగా దేశ ప్రజలందరూ శ్రమించాలని కోరారు. స్థూలకాయం, అధిక రక్తపోటు, మధుమేహం వంటి జీవన శైలి వ్యాధులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలకు అవగాహన పెరిగే స్థాయిలో దేశంలో పౌష్టికాహార ఉద్యమం పెద్ద ఎత్తున చేపట్టాలని సూచించారు. ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఏం తినకూడదో వివరించేలా సమగ్ర మార్గదర్శకాలు రూపొందించి పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. దేశం బలంగా ఉండాలంటే సమాజం బలంగా ఉండాలని.. అందరూ మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు.
Venkaiah Naidu Latest News : 'దేశ నాగరికత, కళ, సాహిత్య సంపదను భావితరాలకు అందించాలి'
Venkaiah Naidu Instructions on Nutrition Food : ప్రతి పనినీ ప్రభుత్వమే చేయాలనుకోరాదని.. ప్రజలు కూడా పూనుకోవాలని సూచించారు. పిల్లలకు చిన్న నాటి నుంచే పౌష్టికాహారం, ఆరోగ్యకర జీవన శైలిపై అవగాహన పెంచుతూ పెద్దలు మంచి జీవన శైలినీ అనుసరిస్తూ పిల్లలకు మార్గదర్శనంగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవడం, సమయానికి పుష్టికరమైన ఆహారం తీసుకోవడం, తగిన వ్యాయామం చేయడం, సూర్యాస్తమయం కాగానే రోజు ముగించడం, సమయానికి నిద్ర పోవడం.. తదితరమైనవి ఆరోగ్యకర జీవనశైలి అని చెప్పారు. తృణధాన్యాలు, చిరుధాన్యాలు రోజువారీ ప్రధాన ఆహారంగా తీసుకుంటే మంచి పోషకాలు లభిస్తాయని తెలిపారు.
సేవతో ఆత్మ సంతృప్తి దొరుకుతుంది : పిజ్జాలు, బర్గర్లు వంటి జంక్ ఫుడ్ మన వాతావరణానికి, వంటికి సరికాదని.. ఆరోగ్యానికి తీవ్ర చేటు చేస్తాయని తెలిపారు. సేవతో ఆత్మ సంతృప్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయన్నారు. ఆయన తన పిల్లలకు సేవా వారసత్వాన్ని అందించానని.. వారు స్వర్ణభారత్ ట్రస్ట్, ముప్పవరపు ట్రస్ట్ ద్వారా గ్రామీణ ప్రజలకు మంచి సేవలు అందిస్తున్నారని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రాన్యూల్స్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చిగురుపాటి ఉమ, స్వర్ణ భారత్ ట్రస్ట్ ముచ్చింతల్ - హైదరాబాద్ ఛాప్టర్ కార్యదర్శి బద్వేల్ సుబ్బారెడ్డి, మెడికవర్ హాస్పిటల్స్ సీఎండీ డాక్టర్ అనిల్ కృష్ణారెడ్డి, సీఆర్పీఎఫ్ మాజీ డీజీ కోడె దుర్గాప్రసాద్, ముప్పవరపు ఫౌండేషన్ ట్రస్టీ ముప్పవరపు రాధ పాల్గొన్నారు.
ఇవీ చదవండి :