Sankranthi At Shilparamam: సంక్రాంతి వచ్చిదంటే చాలు... శిల్పారామంలో సందడే వేరు. ఈ సారి కూడా పండుగ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ మహానగరంలో పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా చేసిన ఏర్పాట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలతో శిల్పారామం సందర్శకులకు సాదర స్వాగతం పలుకుతోంది.
ప్రత్యేక ఆకర్షణగా బోటు షికారు
boating in shilparamam: పచ్చని పచ్చికబయళ్ల మధ్య కుటుంబసమేతంగా సందడిగా చేస్తున్నారు. కొలనులో బోటు షికారు వేడుకల్లో ప్రత్యేకంగా నిలుస్తోంది. గిరిజన మ్యూజియంలో ఫొటోలు దిగుతూ చిన్నాపెద్ద ఉత్సాహంగా గడుపుతున్నారు. ఆటవస్తువులు పిల్లల్లో మరింత హుషారు నింపుతున్నాయి. చేనేత, హస్త కళాకృతుల దుకాణాలు హస్తకళలపై అవగాహన నింపుతున్నాయి. శిల్పారామానికి వస్తే సొంతూరిలో సంక్రాంతి జరుపుకున్నామనే అనుభూతి కలుగుతుందని సందర్శకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సంక్రాంతి వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు శిల్పారామం నిర్వాహకులు తెలిపారు. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మాదాపూర్‌తో పాటు ఉప్పల్ శిల్పారామంలో సంక్రాంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.