ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో ముంపునకు గురైన ఇళ్లను గుర్తించి, వారికి తగిన ఏర్పాట్లు చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీలోని అధిక వర్షపాతంతో నీట మునిగిన ఉస్మాన్ నగర్ కాలనీలో పర్యటించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని.. ప్రస్తుతం ఇళ్లని ఖాళీ చేసి ఆదర్శ పాఠశాలలకు, కమ్యూనిటీ భవనాలకు మారాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటారని తెలిపారు.
గొలుసుకట్టు చెరువుల వల్లే..
బాలాపూర్ మండలంలో గొలుసు కట్టు చెరువులు ఎక్కువగా ఉన్నాయని, చెరువులకు మధ్యలో ఉన్న లింక్లో ఇళ్లు, కాలనీలు వచ్చాయని మంత్రి అన్నారు. 74 ఎకరాల్లో ఉండాల్సిన భుర్హాన్పూర్ చెరువు ప్రస్తుతం 20 ఎకరాల్లోనే ఉందని, ఏఫ్టీఎల్ భూములు అని తెలియక పేదవారు కొన్ని కష్టాల పాలయ్యారని తెలిపారు. గతంలో ఇళ్లు నీట మునిగిన 250 మందికి పట్టాలు ఇచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోకుండా అమ్ముకున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు జల్పల్లి మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్లాహ్ బిన్ అహ్మద్ సాది, తెరాస నేత యూసుఫ్ పటేల్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: జూరాలకు కొనసాగుతున్న వరద... 44గేట్లు ఎత్తివేత