అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో రాష్ట్రం కొత్త ఒరవడిని సృష్టించిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ మండలం చందనవెల్లి, శంకర్ పల్లి మండలం కొండకల్ లో ప్రారంభించిన రెండు అతిపెద్ద కంపెనీల వల్ల 3,700 మందికి ప్రత్యక్షంగా ఉపాధి దొరుకుతుందని తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా పరిపాలన కార్యాలయంలో ఆమె జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
కలెక్టర్ అమోయ్ కుమార్, సైబరాబాద్ సీపీ సజ్జనార్, అదనపు కలెక్టర్లు హరీశ్, ప్రతీక్ జైన్ తోపాటు పోలీసు ఉన్నతాధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం కరోనా పరిస్థితుల దృష్ట్యా ప్రజలకు మరింత పారదర్శకంగా, వేగంగా సేవలందించేందుకు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ను ఈ-ఆఫీస్ గా మారుస్తున్నట్లు సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోర్టల్ ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. జిల్లాలోని అన్ని కార్యాలయాలు ఈ- ఆఫీసులుగా నేటి నుంచి ప్రజలకు సేవలందిస్తాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.